రంగారెడ్డి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అంచనాలకు మించి సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కాలం పంట చేతికి రాగా.. ఇప్పటికే రైతన్నలు చాలా వరకు విక్రయించారు. ప్రస్తుతం జిల్లాలో 95,042 ఎకరాల్లో సాగు కొనసాగుతున్నది. ఇప్పటికే వరి 52,947 ఎకరాలు, వివిధ రకాల పంటలు 15,552 ఎకరాల్లో సాగవుతున్నాయి. రైతులు వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు ప్రాధాన్యమిస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వరి, పొద్దు తిరుగుడు, కుసుమ, వేరుశనగ, మొక్కజొన్న పంటల సాగు బాగా పెరిగింది. జిల్లాలో ప్రధాన పంట అయిన వరి సాగు దశలో ఉంది. అధికారుల అంచనాలకు మించి వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. పంట పొలాల సాగుకు నీటి వనరులు, విద్యుత్, పెట్టుబడులు లాంటి వాటికి కొరత లేకపోవడం, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో సాగు గణనీయం పెరిగింది. గత ఐదేండ్లలో వ్యవసాయ సాగులో ఉన్న భూమి ఎకరాల్లో..
2017-18 (53,080), 2018-19 (36,529), 2019-20 (56,880), 2020-21 (1,22,988), 2021-22 (86,974)
గత సంవత్సరం యాసంగి పంటలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం యాసంగిలో 8,068 ఎకరాల్లో సాగు పెరిగింది. గత సంవత్సరం వరి 47,231 ఎకరాల్లో, ప్రస్తుతం 52,947 ఎకరాల్లో, వేరుశనగ గతంలో 10,132., ప్రస్తుతం 11,140., గతంలో పొద్దుతిరుగుడు 1168, ప్రస్తుతం 1542, గతంలో మొక్కజొన్న 10,305., ప్రస్తుతం 10,360., కుసుమలు గతంలో 5108 ఎకరాలు, ప్రస్తుతం 6125 ఎకరాల్లో సాగవుతున్నాయి.
వరి సాగు ప్రధానంగా గల రంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్ ఇప్పటికే మొదలైంది. వివిధ రకాల పంటల సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలం పండించిన వరి, పత్తి లాంటి పంటలను ఇప్పటికే అమ్మేశారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలను ఖరారు చేయడంతో విక్రయాలు సులువయ్యాయి. రైతులు ఇక యాసంగి సాగును ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లోనూ వ్యవసాయం సంబురంగా సాగుతున్నది. బీడు భూములు పోయి, సెంటు, గుంట భూములు సైతం సాగులోకి వస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల అంచనాను మించి పంటల సాగు జరుగుతున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం రైతులు జొన్న, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, సన్ ఫ్లవర్, ఇంకా ఇతర పంటలను సాగు చేస్తున్నారు.
రబీ సీజన్లో రైతులు జిల్లాలో వరి తరువాత అత్యధికంగా వేరుశనగ, మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి నేలలను బట్టి ఆ పంటలకు ప్రాధాన్యమిస్తున్నారు. కుసుమ, పొద్దు తిరుగుడు పంటలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలాఖరు కల్లా వివిధ పంటల సాగు మొత్తం అంచనాను మించిపోవొచ్చు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనివ్వడంతో రైతులు బీడు భూములను సైతం సాగులోకి తెస్తున్నారు. తద్వారా అంచనాకు మించి వ్యవసాయం సాగులోకి వస్తుంది.
– గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి
ప్రస్తుతం వరి సాగు దశలో ఉంది. జిల్లాలో 52,947 వేల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉంది. రైతులు నారు మడులు, కరిగట్టు దశలో పొలాల్ని చదును చేస్తున్నారు. రైతులు ఏఈవోలు, అధికారుల ద్వారా వివరాలు సేకరిస్తూ సాగు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు 27వేల ఎకరాలకు పైగా వరి సాగులోకి రానున్నది. వరి పంటను రికార్డు స్థాయిలో సాగు చేయనుండగా.. దీంతోపాటు పొద్దుతిరుగుడు, కుసుమ, వేరుశనగ, మొక్కజొన్న పంటలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈమేరకు సాగు అధికారుల అంచనాకు మించి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జొన్న-181, మొక్కజొన్న-1750, శనగలు-3638, వేరుశనగ-3571, సన్ ఫ్లవర్-4197, మిగతా పంటలు 2215 ఎకరాల్లో సాగులో ఉన్నాయి.