కొడంగల్, మార్చి 26 : సీఎం రేవంత్‌రెడ్డి గురువైన ఏపీ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ ఆంధ్రాకు నీటిని తరలిస్తున్న కారణంగానే తెలంగాణలో నీటి సమస్య ఏర్పడిందని, తద్వారా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం కొడంగల్‌కు వచ్చిన ఆయన మధుసూదన్‌రెడ్డి అడ్వకేట్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో చెక్‌డ్యాంల నిర్మాణం, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవడం వల్ల పంట పొలాలకు పుష్కలంగా నీళ్లు అందినట్లు తెలిపారు. మహిళలు రోడ్డెక్కకుండా, ఖాళీ బిందెలతో పొలాలకు పరుగులు తీయకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందించినట్లు పేర్కొన్నారు. గత పది సంవత్సరాల కంటే ఈసారి అధికంగా వర్షాలు కురిశాయని, నీటిని కాపాడుకునే చర్యలు చేపట్టని కారణంగానే నీటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఎక్కడి పంటలు అక్కడే ఎండిపోతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం కురిసిన ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చినట్లు తెలిపారు. వ్యవసాయాధికారులచే సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా అందుకోలేక, ఇటు ఎండలు, నీళ్లు లేక పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మార్చి 31 నాటికి రైతు భరోసా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కేవలం ఉచిత బస్సు అమలు తప్ప మరే ఇతర పథకాలు అమలు కావడం లేదన్నారు.
ప్రస్తుతం రంజాన్ పండుగ సందర్భంగా పేద మైనార్టీ సోదరులకు అందించాల్సిన దుస్తులు, ఇఫ్తార్ విందు మాట కూడా ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఇసుక రవాణాపై కొరడా ఝుళిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినా సొంత నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమంగా ఇసుక రవాణా దందాలు, భూ దందాలు కొనసాగుతున్నట్లు ఆరోపించారు. చెరువులు, చెక్‌డ్యాంలలో ఇసుకను తోడేస్తున్న కారణంగా భూమిలో నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తే కేసులు పెట్టారని.. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేస్తే ఎందుకు కేసులు బనాయించడం లేదన్నారు. కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అక్రమ ఇసుక దందాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి అడ్వకేట్, విష్ణువర్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రావు యాదవ్, యాదగిరి, నారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, నర్మద, రమేశ్‌బాబు, నవాజొద్దీన్, మహేశ్ పాల్గొన్నారు.