బొంరాస్‌పేట, జనవరి 26 : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే దశలో అగ్నికి దగ్ధమైన సంఘటన బుధవారం మండలంలోని మదన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్యాట చిన్న కిష్టయ్యకు గ్రామా సమీపంలో నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. పొలంలో వానాకాలంలో కంది పంటను సాగు చేశాడు. పంట కోతకు రావడంతో రెండు రోజల కిందట కోసి నూర్పిడి కోసం పొలంలో కుప్పలుగా ఉంచాడు.
ఇంతలో బుధవారం మధ్యాహ్నం కోసి ఉంచిన కుప్పలకు నిప్పంటుకుని పంటంతా కాలి బూడిదైంది. చేతికొచ్చిన కంది పంట కాలి బూడిద కావడంతో రైతు లబోదిబోమంటున్నాడు. ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని ఎవరైనా నిప్పంటించారా తెలియడం లేదు. కాలిపోయిన పంట విలువ రూ. 2లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.