రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా సిటీకి కేటాయించిన పట్టా భూములను రైతుల పేర్లమీదికి మారుస్తామంటూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి చేసింది. అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు దాటినా ఆ ఊసే లేదు. అధికారులను అడిగితే తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. భూమి లేదని పిల్లనివ్వటంలేదని ఓ రైతు వాపోయాడు. ఏ రైతును కదిలించినా తమ బాధను వెళ్లగక్కుతున్నారు. పట్టా భూములు కలిగిన రైతులు చేస్తున్న భూపోరాటంలో రైతుల పక్షాన విజయం వరిస్తుందా అన్నదానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)
హామీని మరిచారు
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫార్మా అనుబంధ గ్రామాల్లో రైతుల పట్టా భూములు ఎక్కడికీ పోవని, తాము అధికారంలోకి రాగానే ఇప్పిస్తామని ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా బాధిత గ్రామాల్లో పర్యటించి రైతులకు హామీ ఇచ్చారు. అలాగే, ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా బాధిత గ్రామాల్లో పర్యటించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అథారిటీలో జమచేసిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి పంపించి, రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాని, ఇప్పటివరకు ఆ హామీని మర్చిపోయి రైతులకు ఏమాత్రం న్యాయం చేయలేదు. ‘మా భూములను మాకిప్పించండి’ అని అధికార పార్టీ నాయకులను వేడుకున్నా పట్టించుకోవటంలేదు. ఒక్క వినోద్రెడ్డే కాకుండా ఫార్మా అనుబంధ గ్రామాలైన మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల్లో ఏ రైతును కదిలించినా తమ బాధను వెళ్లగక్కుతున్నారు.
రైతుల డబ్బులను అథారిటీలో జమచేశారు
ఫార్మాసిటీ కోసం ఇప్పటికే తాటిపర్తి, నానక్‌నగర్, కుర్మిద్ద, మేడిపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతుల పట్టా భూములకు సంబంధించి గతంలోనే భూసేకరణ జరిగిపోయింది. సుమారు 2500 ఎకరాల పట్టా భూములకు సంబంధించి పరిహారం కూడా భూసేకరణ అథారిటీలో జమచేయటం జరిగింది. భూసేకరణ జరిగిపోయినందునే రైతుల పేర్లను నిషేధిత జాబితాలో నుంచి ఆ భూములను టీజీఐఐసీ పేరుమీదకు చేర్చటం జరిగింది. ఒక్కసారి భూసేకరణ జరిగిన తర్వాత తిరిగి రైతులకు భూములు ఇవ్వటం అంత సులువు కాదు. గతంలోనే ఈ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. తిరిగి రైతులకు ఇవ్వటం జరగదు.
– ఆర్డీవో అనంతరెడ్డి
భూమిలేదని పిల్లనివ్వటంలేదు..!
‘మాది వ్యవసాయ కుటుంబం.. వ్యవసాయంపై ఆధారపడి మా తాతలు.. తండ్రులు, మేము జీవిస్తున్నాం. మా భూములను ఫార్మాసిటీ కోసం బలవంతంగా తీసుకుని.. నిషేధిత జాబితాలో చేర్చి మాకు వచ్చే రైతు బంధు రుణాలను కూడా ఇవ్వకుండా చేశారు. మా పేరున భూమి లేకపోవటంతో పెళ్లి చేసుకోవటానికి ఎవరూ పిల్లను కూడా ఇవ్వటంలేదు. దయచేసి మా భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి మా పేర్లను రికార్డుల్లో చేర్చండని’ ఫార్మా అనుబంధ గ్రామమైన కుర్మిద్ద గ్రామానికి చెందిన రైతు వినోద్‌రెడ్డి వాపోతున్నాడు.
నిషేధిత జాబితాలో ఉన్న భూములు
గ్రామం : ఎకరాలు
మేడిపల్లి : 483
నానక్‌నగర్ : 154
తాటిపర్తి : 382
కుర్మిద్ద : 974