కొందుర్గు, జులై 9 : కాంగ్రెస్ నాయకులు ప్రచార ఆర్భాటం మానుకొని ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో ఏనాడైనా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలన్న ఆలోచన వచ్చిందా? అని వారు ప్రశ్నించారు. కొందుర్గ్‌లో బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గత రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రాజెక్టులపై మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నామని విషయాన్ని మర్చిపోయి అర్థంలేని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలనే ఉద్దేశంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగానే నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు అన్ని రిజర్వాయర్లను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గ్రహించాలని బీఆర్ఎస్ నాయకులు సూచించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి షాద్ నగర్ ప్రాంతంలో సాగునీరును అందించేందుకు ఇప్పటికే కాలువల సర్వేలు పూర్తి చేశారని, అప్పట్లోనే టెండర్లను సైతం పిలిచారని చెప్పారు. ప్రాజెక్టు స్థితిగతులు, నిర్మాణాలు, రిజర్వాయర్ల సామర్థ్యాలు, ఆయకట్టు వంటి అంశాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు చెల్లిందని మండిపడ్డారు.
గతంలోనే పాలమూరు ఎత్తిపోతలపై ఐదు రిజర్వాయర్లను పూర్తిచేస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌పై ఇప్పటికీ ఒక్క పైసా కూడా వెచ్చించలేదని, ఆ ప్రాజెక్టు ఊసేలేదని విమర్శించారు. పైగా లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ నిర్మిస్తే ఇక్కడి ప్రజలకు నష్టం జరుగుతుందని ఇప్పటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అప్పట్లో ఆందోళన చేసిన విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని గుర్తు చేశారు. కేవలం చౌకబారు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ రైతు సంక్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ప్రాజెక్టులపై నీతులు వల్లించడం సిగ్గుచేటు అని విమర్శించారు. చేతనైతే, రైతులపై మీకు ప్రేమ ఉంటే మీ ఎమ్మెల్యే చేత ప్రాజెక్టు నిర్మాణ పనులను చేయించాలని సవాలు విసిరారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం, పసలేని విలేకరుల సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, ఏ విషయాల పైన అవగాహన లేకుండా ఉద్దెర ముచ్చట్లు చెప్పడం మానేసి ప్రజా సంక్షేమంపై దృష్టి సాధించాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో పద్మారం మాజీ ఎంపీటీసీలు రాములు, మాణయ్య, నాయకులు నరసింహులు, వీరన్న చారి, అంకం శేఖర్, రాములు, బైరంపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.