కేశంపేట, జూన్ 18 : మండలంలోని కొత్తపేట చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పార్టీ నేత అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. చెరువులో మట్టి తవ్వకాలు ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ యంత్రాంగమే తమ ఆధీనంలో తమే చేతుల్లో ఉందని.. మీకు దిక్కున చోట చెప్పుకోవాలంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా చౌటచెరువు తవ్వకాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు మొదలైన తవ్వకాలు రాత్రి పది గంటల సమయం దాటినా కొనసాగాయని.. అయినా అటు వైపుగా అధికారులు ఎవరూ రాలేదని గ్రామస్తులు వాపోయారు. అధికార పార్టీకి చెందిన నేత తన పొలాన్ని చదును చేసుకునేందుకు చెరువులో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి.. మట్టితవ్వకాలకు బ్రేకులు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సదరు నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.