Rangareddy | నందిగామ, జూన్ 22 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. మోత్కూలగూడ గ్రామంలో 1999లో అప్పటి ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించింది. ఇందులో భాగంగానే గ్రామానికి చెందిన వానరసి ఎల్లమ్మకు సైతం 75 నెంబర్ గల ప్లాట్‌ను అధికారికంగా ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచ్ ఎల్లమ్మకు సంబంధించిన ప్లాట్‌పై గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత కన్ను పడింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ అండతో గ్రామానికి చెందిన కొంత మందిని అడ్డు పెట్టుకొని ఎల్లమ్మ ప్లాట్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయమై నందిగామ తహశీల్దార్, మండల పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సర్పంచ్ ఎల్లమ్మతో పాటు ఆమె కుమారులను కాంగ్రెస్ నేత కులం పేరుతో దూషించి, ప్లాట్ వదిలి పెట్టకుంటే మీ అంతు చూస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కుమారుడు నర్సింహా పోలీసులకు, ఎస్సి, ఎస్టీ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అండతో కాంగ్రెస్ నేత శంకరయ్య తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మాజీ సర్పంచ్ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వల్ల పరిస్థితి ఏమిటి అని ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.