కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయమూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించిన వారికి అన్యాయం చేస్తున్నది. ఎన్నికలకు ముందు ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకోవడం, తదితర కొర్రీలు పెట్టి అర్హులైన పేద రైతులకు రుణమాఫీ వర్తించకుండా రేవంత్ సర్కార్ దగా చేసింది. రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండగా.. కేవలం రూ.1.50 లక్షల వరకు మాత్రమే పూర్తయింది.
నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను జిల్లా వ్యవసాయాధికారులు విడుదల చేసి నెల రోజులు దాటుతున్నా సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రం ఇంకా రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. తమ రుణాలు ఎప్పడు మాఫీ అవుతాయంటూ సంబంధిత రైతులు వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే విషయమై వ్యవసాయాధికారులను వివరణ కోరగా.. త్వరలో మాఫీ డబ్బులు జమవుతాయంటూ చెబుతున్నారే తప్ప ఎప్పుడనేది ప్రభుత్వం నుంచి స్పష్టత లేదనటం గమనార్హం. ఇప్పటివరకు రూ.1.50 లక్షల రుణాలలోపు ఉన్న రూ.750 కోట్ల రుణాలను మాఫీ చేయగా, నాలుగో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలలోపు రుణాలున్న మరో 10,660 మంది రైతులకు సంబంధించిన రూ.98.17 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉన్నది.
– వికారాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)
కటాఫ్ రుణాన్ని చెల్లించినా..
పట్టాదారు పాసుపుస్తకాలను కాకుండా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో చాలా మంది అర్హులైన రైతులు నష్టపోయారు. అదేవిధంగా రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాలను ఆగస్టు 15లోగా చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయాధికారులు చెప్పడంతో సుమారు 2 వేల మంది రైతులు చెల్లించారు. సంబంధిత రశీదులను వ్యవసాయాధికారులకు అందజేసినప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు కట్టి 4 నెలలైనా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రుణాలను మాఫీ చేస్తున్నామంటూనే తిరిగి రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికి ఇప్పుడు నట్టేట ముంచుతుండడంపై రైతులు సర్కారుపై తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. మరోవైపు రుణాలు రూ.2లక్షల పైచిలుకు ఉన్న రైతులు మిగతా రుణాలను చెల్లించేందుకుగాను వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు.
గ్రీవెన్స్‌లో ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించని ప్రభుత్వం
మరోవైపు రెండు నెలలపాటు సేకరించిన రుణమాఫీ గ్రీవెన్స్‌లో ఒక్కటంటే ఒక్క దరఖాస్తును కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. జిల్లావ్యాప్తంగా గ్రీవెన్స్‌కు సంబంధించి దాదాపు 30 వేల వరకు రైతులు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు. అందులో 18,431 మంది రైతులకు రేషన్ కార్డు లేకపోవడంతోనే రుణమాఫీ కాలేదని వ్యవసాయాధికారులు ఇచ్చిన సర్వేలో వెల్లడైంది. అత్యధికంగా నవాబుపేట మండలంలో రెండు వేల మందికిపైగా రైతులు ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మంది రైతులుండగా.. సుమారు 2 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకోగా.. వీరిలో కేవలం 1.01 లక్షల మంది రైతులను మాత్రమే రూ.2 లక్షలలోపు రుణమాఫీకి అర్హులుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.