షాబాద్, జూన్ 21 : గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికో క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. అందులో ఆడుకునేందుకు వీలుగా స్పోర్ట్స్ కిట్లనూ అందజేసింది. ఈ విధంగా జిల్లాలో 547 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయగా..యువత ఆటలాడి తర్ఫీదు పొందారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను పట్టించుకోకపోవడంతో అవి వృథాగా కనిపిస్తున్నాయి.
స్పోర్ట్స్ కిట్లను బయటికి తీసి ఆడిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో స్పోర్ట్స్ కిట్లు గ్రామ పంచాయతీలకే పరిమితం కాగా.. మైదానాల్లో గడ్డి మొలిచి పిచ్చి మొక్కలతో అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల పశువులు సంచరిస్తుండగా.. మరికొన్ని క్రీడాప్రాంగణాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. దీంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
క్రీడాప్రాంగణాలు వినియోగంలో లేకపోవడంతో పిచ్చిమొక్కలు, గడ్డితో దర్శనమిస్తున్నాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో మైదానాలను ఏర్పాటు చేసి కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లనూ అందించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం క్రీడాకారులను విస్మరిస్తుండడంతో స్పోర్ట్స్ కిట్లన్నీ పంచాయతీలకే పరిమితమవుతున్నాయి. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలి.
-ఇమ్రాన్, క్రీడాకారుడు, షాబాద్
జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లోని 526 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికో క్రీడా ప్రాంగణం చొప్పున 547 తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఒక్కో గ్రామ పంచాయతీలో 20 గుంటల చొప్పున భూమిని కూడా కేటాయించింది. దాదాపుగా రూ.2,50,000 వరకు ఖర్చు చేశారు.
చాలా గ్రామాల్లో స్థలాల కొరత ఉండడంతో పాఠశాల ప్రాంగణాలు, ఖాళీగా ఉన్న కొద్దిపాటి స్థలాలు, వైకుంఠధామాలు, గ్రామ పంచాయతీల పక్కన తెలంగాణ క్రీడా ప్రాంగణం పేరిట బోర్డు, వాలీబాల్ కోర్టు, వ్యాయామం చేసేందుకు పరికరాలను ఏర్పాటు చేశారు. కానీ, ప్రస్తుతం వాటి నిర్వహణ కొరవడడం తో పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. మరోవైపు నిధుల కొరతతో పంచాయతీలు వాటి నిర్వహణను గాలికొదిలేశాయి.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసి.. అవసరమైన ఆట వస్తువులను అందజేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా నిర్ల క్ష్యం చేయడం సరికాదు. చాలా గ్రా మాల్లో పిచ్చిమొక్కలతో క్రీడా ప్రాంగణాలన్నీ అధ్వానంగా మారాయి. ప్రభుత్వం స్పందించి క్రీడాప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలి.
-గంగిడి భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత, హైతాబాద్, షాబాద్