షాబాద్, జూన్ 28: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నదనే అరోపణలు వెల్లవెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ (Cheyutha Pension) రెట్టింపు చేసి రూ. 4,016, దివ్యాంగులకు రూ.6,016 చొప్పున ప్రతి ఇంట్లో అర్హులైన ఇద్దరికీ అందజేస్తామని ప్రకటించి, ఇప్పుడు విస్మరించడంపై ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 1.95.482 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఎన్నికల ముందు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు చేయూత పథకం కింద పెన్షన్ రెండింతల పెంచుతామంటూ మెనిఫెస్టో ద్వారా ప్రకటించడంతో ఆశపడి మద్దతిస్తే, ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు స్పందన లేదని వాపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన విధానాన్ని చూస్తుంటే గత కేసీఆర్ ప్రభుత్వమే తమకు ఎంతగానో ఆదుకుందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రతి నెల పింఛన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 1.95.482 మంది లబ్ధిదారులు వివిధ రకాల పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో 76,254 మంది వృద్ధులు, 82,306 మంది వితంతువులు, 26,660 మంది దివ్యాంగులు, చేనేత కార్మికులు 804 మంది, గీత కార్మికులు 2,303 మంది, బీడీ కార్మికులు 14 మంది, ఒంటరి మహిళలు 6,401 మంది, ఫైలేరియా 57 మంది, డయాలసిస్ పెషెంట్లు 683 మంది లబ్ధిదారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ మాత్రమే అందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్న ఇప్పటివరకు కొత్త పెన్షన్ల జాడ కనిపించడం లేదు. ఏళ్ల తరబడి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నామని అర్హులైన ప్రజలు వాపోతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో పేదల కోసం ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో, పదేళ్ల కాలం పాటు ఎలాంటి సమస్యలు లేకుండా పేదలంతా తమ కుటుంబాలను నెట్టుకొచ్చారు. గతంలో 65 ఏళ్లున్న వారికి మాత్రమే మంజూరయ్యే వృద్ధాప్య పెన్షన్ 57 ఏండ్లకు కుదించి, అమలు చేసింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, అసహాయులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 అందించింది. అయితే గత ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ రెట్టింపు చేసి రూ. వృద్ధులకు రూ.4,016, దివ్యాంగులకు రూ.6,016 చొప్పున ప్రతి ఇంట్లో అర్హులైన ఇద్దరికీ అందజేస్తామంటూ ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పింఛన్నే ప్రస్తుతం కొనసాగిస్తూ వస్తుంది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు రెట్టింపు చేసి వెంటనే అందించాలని, కొత్త పింఛన్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ ఓట్ల ముందు పింఛన్ డబ్బులు పెంచుతామని మాట ఇచ్చి, ఇప్పుడు దాని గురించి ఏమి చెబుతలేదని బేగరి మల్లయ్య అనే వృద్ధుడు అన్నారు. ఇంతకు ముందు కేసీఆర్ సార్ రూ.200 ఉన్న పింఛన్ పైసలు రూ.2,016కి పెంచి మమ్మల్ని ఆదుకున్నాడు. కాంగ్రెస్ సర్కార్ వస్తే రూ.4,016 ఇస్తామని మాట చెప్పిండ్రు. ఇప్పటికి ఇయ్యకపోవడం మంచి పద్ధతి కాదు. ఎప్పుడు పెంచుతారోనని ఎదురుచూస్తున్నాము. సర్కార్ వెంటనే పింఛన్ల పైసలు పెంచి అందించాలని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వృద్ధులకు రూ.4,016, దివ్యాంగులకు రూ.6,016 ఇస్తామని మాట ఇచ్చి, ప్రస్తుతం దాని గురించి పట్టించుకోవడం లేదని చేవెళ్లకు చెందిన దివ్యాంగుడు పొట్ట మల్లేశ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా పింఛన్ల పెంపు ఊసేలేదు. పింఛన్ డబ్బులు పెంచుతారని ఎంతోమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేయూత పథకం ద్వారా లబ్దిదారులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు రెట్టింపు చేసి అందజేసి మాట నిలబెట్టుకోవాలన్నారు.
ఆరు గ్యారంటీల పేరులో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత సూద యాదయ్య చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన పింఛన్లు రెండింతలు చేసి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పటివరకు పింఛన్ల గురించి మాట్లడకపోవడం దారుణంగా ఉంది. గ్రామాల్లో కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పింఛన్లు రెండింతలు చేసి, కొత్త పింఛన్లు అందించకుంటే రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని వెల్లడించారు.