ఫార్మాసిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలోని యాచారం, ముచ్చర్ల ప్రాంతాల్లో భూసేకరణను అడ్డుకుని రాజకీయ లబ్ధి పొందిన ఆ పార్టీ.. వికారాబాద్ జిల్లాలో అన్నదాతలు మా ప్రాంతంలో ఫార్మా విలేజ్ వద్దే.. వద్దు అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నా భూసేకరణకు చర్యలు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు.. తాము అధికారంలోకి రాగా నే ఫార్మాసిటీని రద్దు చేస్తామని.. రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి వారికే ఇస్తామని ప్రజలు, అన్నదాతలను రెచ్చగొట్టారు. పవర్లోకి రాగానే ఆ మాటను మరిచిపోయారు. రైతులు అడిగితే వారు తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో తమ ప్రాంతాల్లో ఫార్మాసిటీ ఉంటుం దా..? ఉండదా..? అనే విషయంపై సర్కారు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఒప్పించి.. కందుకూరు, యాచారం మండలంలో 13,500 ఎకరాల భూములను సేకరించింది.
-రంగారెడ్డి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని యాచారం మండలంలో అత్యధికంగా సుమారు 10,000 ఎకరాల అసైన్డ్, పట్టా భూముల ను సేకరించాల్సి ఉండగా కేసీఆర్ ప్రభుత్వం 7,640 ఎకరాలను సేకరించింది. 2,211 ఎకరాలు కోర్టు వివాదంలో ఉండగా ఆ భూములకు కూడా అవార్డు పాస్ చేసి పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసింది. అలాగే, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో మరో 10,000 ఎకరాలు సేకరించాల్సి ఉండగా …కడ్తాల్ మినహా కందుకూరు మండలంలో అక్కడి రైతులను ఒప్పించి భూములు ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లోనే నేడు ఫ్యూచర్‌సిటీ ఏర్పాటుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది.
జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూ ముల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంటున్నది. అరబిందో, రెడ్డీస్ ల్యాబ్స్ తదితర దిగ్గజ కంపెనీలతో రేవంత్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకున్నది. గతంలో ఫార్మాసిటీ వద్దన్న కాంగ్రెస్ నాయకులు.. ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకోవడంపై రైతు సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. ఒక్కో కంపెనీకి 50 ఎకరాల చొప్పున పరిశ్రమల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించ నున్నట్లు సమాచారం.
ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని స్పష్టం చేయాలి. ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పిన ఆ పార్టీ నాయకులు మరోవైపు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంతో ఈ ప్రాంత ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇంతకు ముచ్చర్లలో ఫార్మాసిటీ ఉం టుం దా..? ఉండదా..? చెప్పాలి. నాడు ఫార్మాసిటీని వ్యతిరేకించి.. నేడు వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు భూములను సేకరించడం విస్మయానికి గురి చేస్తున్నది.
రైతులకు భూములు తిరిగి ఇవ్వాలి
గత ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారా..? లేదా..? అనే విషయంపై సర్కారు స్పష్టతనివ్వాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు రైతుల భూములను వారికి తిరిగి ఇవ్వాలి. కానీ, రేవంత్‌రెడ్డి సర్కారు భూముల విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఒకసారి ఫార్మాసిటీ ఉంటుందని.. మరోసారి ఉండదు అని ప్రజలు, రైతులను అయోమయానికి గురిచేస్తున్నది.
-బాలకృష్ణగౌడ్, మీర్ఖాన్పేట్