వికారాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ కానివారి కోసం గ్రీవెన్స్ అనేది కేవలం కాలయాపన కోసమేనంటూ రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడుత రుణమాఫీ జాబితా విడుదల నుంచి రైతులు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంతోపాటు ఏడీ కార్యాలయాలు, మండల వ్యవసాయాధికారి కార్యాలయాల్లో రుణమాఫీ కాలేదంటూ ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదును కూడా ప్రభుత్వం పరిష్కరించి, రుణమాఫీ చేయకపోవడం గమనార్హం. అర్హులైనప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు మండల వ్యవసాయాధికారి కార్యాలయంతోపాటు ఏడీ కార్యాలయం, జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఒక్కో రైతు ఇప్పటికీ నాలుగైదు సార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.70 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే వీరిలో కేవలం 91 వేల మంది రైతులకు మాత్రమే రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. జిల్లాలో రూ.2 లక్షలలోపు రుణమాఫీతో కేవలం 91,956 మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరింది. మొదటి విడుతలో రూ.లక్షలోపు రుణమాఫీతో 46,633 మంది రైతులకుగాను రూ.256.26 కోట్ల రుణమాఫీ కాగా, రెండో విడుతలో రూ.లక్షన్నరలోపు రుణమాఫీతో 26,438 మంది రైతులకుగాను రూ.265.04 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. చివరి విడుతలో రూ.2 లక్షలలోపు రుణమాఫీతో 18,885 మంది రైతులకు గాను రూ.247.71 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అయితే రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడం, ఒకరి ఆధార్ నంబర్‌కు బదులు మరొకరి ఆధార్ నంబర్ ఎంట్రీ చేయడం, వడ్డీని కలుపకుండా కేవలం రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే ఎంట్రీ చేయడం తదితర కారణాలతో జిల్లాలోని దాదాపు 80 వేల మంది అన్నదాతలకు రుణమాఫీ లబ్ధి చేకూరలేదు.
రుణమాఫీ గ్రీవెన్స్‌కు 4642 ఫిర్యాదులు…
జిల్లాలో రుణమాఫీ కాలేదని అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. వ్యవసాయ కార్యాలయాలతోపాటు బ్యాంకుల వద్ద ఉదయం నుంచే ఫిర్యాదులు చేసేందుకు రైతులు బారులు తీరుతున్నారు. గత 20 రోజులుగా వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా త్వరలో మీ రుణాలు మాఫీ అవుతాయంటూ సమాధానం చెబుతూ రైతులను పంపించేస్తున్నారు. వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు చెబుతున్న సమాధానాలకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో వ్యవసాయ కార్యాలయాల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా రూ.2 లక్షల రుణాలను మాఫీ చేయాలని మిగతా రుణాలను ఎన్ని కష్టాలు పడినా మేం చెల్లించుకుంటామని, మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చే రైతులకు వ్యవసాయాధికారులు ఏదో ఒకటి చెబుతూ పంపిస్తున్నారు. మరోవైపు రూ.199,999 రుణాలను మించి ఉన్న రైతుల పరిస్థితి మరీ గందరగోళంగా తయారైంది. కటాఫ్ రుణానికి మించి ఉన్న రైతుల్లో చాలా మంది ఇప్పటికే పైన ఉన్న రుణాలను చెల్లించి సంబంధిత రసీదులను వ్యవసాయాధికారులకు అందజేసినప్పటికీ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కటాఫ్ రుణానికి మించి ఉన్న రుణాలను చెల్లిస్తేనే మాఫీ అవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ ఎప్పుడు మాఫీ అవుతదనేది, దానికి సంబంధించిన విధివిధానాలు మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాకపోవడం గమనార్హం. మరోవైపు రుణాలు రూ.2 లక్షల పైచిలుకు ఉన్న రైతులు డబ్బును చెల్లించేందుకుగాను వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రుణమాఫీ వర్తించాలంటూ కటాఫ్ రుణాలకు మించి ఉన్న మొత్తాన్ని చెల్లించేందుకు రైతులపై పరోక్షంగా ఒత్తిడి తెస్తుండడంతో అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే పంట పెట్టుబడికి అప్పులు చేసిన రైతులు, ఇప్పుడు రుణమాఫీ వర్తించేందుకు అప్పులు చేస్తుండడం భారంగా మారిపోయింది. గ్రీవెన్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా పోర్టల్ అందుబాటులోకి తీసుకురాక ముందు జిల్లావ్యాప్తంగా 2500 వరకు ఫిర్యాదులు రాగా, గత వారం రోజులుగా 4642 మంది రైతులు రుణమాఫీ కాలేదని ఫిర్యాదులను అందజేశారు.
అర్హత ఉన్నా మాఫీ కాలె..
తాండూరు పట్టణంలోని ఎస్బీఐ (ఏడీబీ) బ్యాంకులో పంట రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అర్హత ఉన్నా రుణమాఫీ కాలె. ఎన్నికలప్పుడు ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పిండు. ఇప్పుడేమో నానా ఇబ్బందులు పెడుతుండ్రు. రుణమాఫీ కొందరికేనా అందరికా.. అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేయాలని చూస్తున్నది. రుణమాఫీ కోసం ప్రతి పల్లెలోని రైతులు నానా తంటాలు పడుతుండ్రు.
– శంకర్ నాయక్, జయరాం తండా(ఓమ్లానాయక్ తండా), పెద్దేముల్ మండలం
కాంగ్రెస్‌వన్నీ మాయ మాటలే..
ఏకకాలంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మాయమాటలు చెప్పింది. ఇప్పుడు లేని కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నది. పెద్దేముల్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.లక్షా 4వేల రుణం తీసుకున్నా. ఇంత వరకు మొదటి దఫా, రెండవ దఫా, మూడో దఫాలోనూ రుణమాఫీ కాలె. అధికారులను అడిగితే ఎన్నో సాకులు చెబుతున్నారు. అరకొర మాఫీలు చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పూర్తిస్థాయిలో రుణాలను మాఫీ చేసి రైతులను మెప్పించింది లేదు. ఈ కాంగ్రెస్‌ను మళ్లా ఎట్లా నమ్మాలి.
– కే మహేశ్, మారేపల్లి గ్రామం, పెద్దేముల్ మండలం
కాంగ్రెస్.. మాట నిలబెట్టుకోవాలె..
ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలె. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిండు. పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘంలో రూ.లక్షా 25 వేల అప్పు తీసుకున్నా. మూడో విడుతలోనూ మాఫీ కాలె. నిత్యం బ్యాంకు, వ్యవసాయ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా. వాళ్లు ఏవేవో కారణాలు చెప్పి మాట దాటవేస్తుండ్రు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఓటు వేసినం. రైతులను మోసం చేసే ఏ పార్టీ అయినా మట్టికొట్టుకుపోవాల్సిందే. రైతులను ఇబ్బందులు పెడితే రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు.
– రాంచందర్, గిర్మాపూర్,పెద్దేముల్ మండలం