వికారాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని ఆశించే వారికి నిరాశే మిగులుతున్నది. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అం దించేందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్నామని చెబుతున్నా పేదవారికి అందని ద్రాక్షలా మారిపోయింది. ఓ వైపు ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుధ్యం లోపించడం, సరైన సౌకర్యాలు లేకపోవడం.. మరోవైపు సమయానికి వైద్యులు రాక రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధానంగా జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ఆధీనంలోని తాం డూరు జిల్లా ఆసుపత్రితోపాటు మాతాశిశు, ఏరి యా దవాఖానల్లో పనిచేస్తున్న అధికారులు, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వైద్య విధాన పరిషత్ కింద పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌కే ప్రాధాన్యమిస్తున్నట్టు పలువురు రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఆసుపత్రితోపాటు మాతాశిశు సంరక్షణాసుపత్రి, ప్రభు త్వ ఏరియా దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యుల్లో మెజార్టీ డాక్టర్లు సొంత క్లినిక్‌లను కొనసాగిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలున్నా యి.
అయితే వారిని పర్యవేక్షించాల్సిన డీసీహెచ్‌ఎస్‌తోపాటు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల సూ పరింటెండెంట్లు కూడా ప్రభుత్వం నుంచి రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూ సొంత క్లినిక్‌ల్లో ప్రాక్టీస్‌కే ప్రాధాన్యమిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్యం అందదని భావించి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులవైపు వెళ్తున్నారు. జిల్లాసుపత్రితోపాటు అన్ని ఏరియా దవాఖానల్లో మందులున్నాయని పేర్కొంటున్నా కొన్ని మందులను బయట తెచ్చుకోమని పలువురు వైద్యులు సూచిస్తుండడం గమనార్హం. మరోవైపు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే ఆసుప త్రిలో ఉంటూ మిగతా రోజుల్లో సొంత క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్న పలువురు వైద్యులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, రోగులు కోరుతున్నారు. మరోవైపు కాయకాల్ప నిధుల వినియోగంలోనూ 2025-26 ఏడాదికి అవార్డు కింద రూ.25 లక్షలు మంజూరుకాగా సంబంధిత నిధుల్లో దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి.
వారానికి ఒక్కరోజే డ్యూటీ..
తాండూరులోని ప్రభుత్వ జిల్లాస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బం ది పడుతున్నారు. పేరుకే జిల్లా ఆసుపత్రి తప్ప సేవల్లో అధమస్థాయిలో ఉందన్నా ఆరోపణలున్నాయి. ఇక్కడ వైద్యులు, నర్సులు సరిపడా ఉన్నా ఒక్కో వైద్యుడు 24 గంటలపాటు విధులు నిర్వర్తిస్తూ, వారానికి ఒక్కసారే హాజరవుతున్నట్టు ఆరోపణలున్నాయి. 24 గంటలపాటు వైద్య సేవలు ఉండాల్సిన జిల్లాస్పత్రిలో మధ్యాహ్నం వరకే ఒకరిద్దరు వైద్యులుండడం, తదనంతరం నర్సులతోనే కాలం వెల్లదీస్తుండ డం గమనార్హం.
తాండూరు జిల్లాసుపత్రితోపాటు మాతాశిశు దవాఖానలో 70 మంది వైద్యులుండాల్సి ఉండగా, వారిలో 10 మంది వైద్యులు రోజూ విధులకు హాజరుకావడంలేదని సమాచారం. పై రెండు దవాఖానల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉండగా..విధులకు హాజర య్యే ముగ్గురు, నలుగురు వైద్యులు కూడా మధ్యాహ్న సమయంలోనే వెళ్లిపోతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు ప్రతిరోజూ విధులకు హాజరుకావాల్సి ఉండగా .. వారు వారానికి ఒక్కరోజే వచ్చి మిగతా రోజుల్లో వారి స్థానంలో కాంట్రాక్ట్ వైద్యులతో నడిపిస్తున్నట్టు తెలిసింది. డీసీహెచ్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వారి ఆటలు సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. మాతాశిశు దవాఖానలో ప్రతి రోజూ ఇద్దరు గైనకాలజిస్ట్లు 24 గంటలపాటు విధుల్లో తప్పనిసరిగా ఉండాలి.. కానీ, ఒక్కరు మాత్రమే విధుల్లో ఉంటున్నట్టు సమాచారం.
కొరవడిన పర్యవేక్షణ
తాండూరులోని జిల్లా ప్రభుత్వ, మాతాశిశు దవాఖానల్లోని సూపరింటెండెంట్లతోపాటు వైద్యులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ వారానికి ఒక్కరోజే విధులకు హాజరవుతూ సర్కార్‌ను మోసం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. వైద్యవిధాన పరిషత్ ఆధీనంలో జిల్లా ఆసుపత్రితోపాటు సీహెచ్‌సీలు, ఎంసీహెచ్‌లు కొనసాగుతున్నా యి. కానీ పర్యవేక్షణ ఎవరనేది స్పష్టత లేదు. డీసీహెచ్ఎస్లే సొంత క్లినిక్‌ల్లో ప్రాక్టీస్ చేస్తుండడంతో వైద్యులూ క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. జిల్లా ఉన్నతాధికారులు కూడా వీరి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతున్నట్లు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.