పచ్చటి పంట పొలాల మధ్య డంపింగ్‌యార్డు వద్దంటూ మండలంలోని రంగాపూర్ గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. మాజీ ఎంపీపీ అరవిందరావు, మాదారం మాజీ సర్పంచ్ రాములు, పలువురు రైతులు మట్టి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకునేందుకు రావడంతో పరిగి మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తను తమ గ్రామంలోని పచ్చని పంట పొలాల మధ్య ఎందుకు వేస్తారని.. సమీపంలో ఆలయాలు సైతం ఉన్నాయంటూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు మహిళా రైతులను అరెస్టు చేసిన పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో డంపింగ్ యార్డు శంకుస్థాపనకు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి రావాల్సి ఉన్నది. కానీ ఆయన రాకపోవడంతో అధికారులు హడావుడిగా శంకుస్థాపన చేశారు. – పరిగి, డిసెంబర్ 3
భారీ బందోబస్తు మధ్య అధికారులతో శంకుస్థాపన..
రైతులు తీవ్ర ఆందోళన చేస్తుండడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య పరిగి తహసీల్దార్ ఆనంద్‌రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్యలతో డంపింగ్ యార్డు శిలాఫలకానికి శంకుస్థాపన చేయించారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ఒక ఎస్ఐ, నలుగురు లేదా ఐదుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. కానీ డంపింగ్‌యార్డు శంకుస్థాపన కోసం మాత్రం ఏకంగా డీఎస్పీ, సీఐ, పలువురు ఎస్ఐలు, అధిక సంఖ్యలో కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించడం గమనార్హం.
నిధుల కేటాయింపు..
డంపింగ్ యార్డు ప్రహరీ, ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం కోసం 15వ ఆర్థిక సంఘం కింద రూ.25 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. డంపింగ్‌యార్డులో సెగ్రిగేషన్ షెడ్డు, కంపోస్టు ఎరువుల తయారీకి మరో రూ.50 లక్షల నిధులను మంజూరు చేయనున్నట్లు తెలిసింది.
రోగాలబారిన పడుతం..
గ్రామాల మధ్య డంపింగ్‌యార్డును ఏర్పాటు చేస్తే రోగాలబారిన పడుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నిస్తే వద్దని చెప్పడంతో విరమించుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకంగా శంకుస్థాపన చేయడం సరికాదు.
– బాల్‌రాజ్, రంగాపూర్
డంపింగ్ యార్డు ఏర్పాటు ఇలా..
పరిగి మున్సిపాలిటీకి డంపింగ్‌యార్డు లేదు. దీంతో రంగాపూర్ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 50లో 2.26 ఎకరాలు, మాదారం గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 288లో 0.14 ఎకరాలు కలిపి మొత్తం మూడు ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు సెప్టెంబర్ 28న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థలం రంగాపూర్, మాదారం, నజీరాబాద్తండాల మధ్య ఉంటుంది. దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని కలిసి గ్రామాల మధ్య డంపింగ్ యార్డు ఏర్పాటు చేయవద్దని విన్నవించినా శంకుస్థాపన చేయించడం గమనార్హం.
ప్రజలు వద్దంటే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు..
– కొప్పుల మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మూడు గ్రామాల ప్రజలు డంపింగ్‌యార్డు వద్దని వ్యతిరేకిస్తుంటే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆయన ఘటనా స్థలానికి వెళ్లి తహసీల్దార్ ఆనంద్‌రావుతో మాట్లాడారు. గతంలో ఇక్కడ డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయాలని ఆలోచించగా రైతులు వ్యతిరేకించడంతో శాఖాపూర్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, కొంత మేర పనులు సైతం చేపట్టామన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా మళ్లీ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని తహసీల్దార్‌ను నిలదీశారు.