కొత్తూరు, డిసెంబర్ 13 : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. కానీ, నూతనంగా గెలిచిన సర్పంచ్‌కు ఆ విషయం తెలియనట్టు ఉన్నది. గెలిచిన రెండు రోజులకే అధికార పార్టీకి చెందిన తనను ఎవరు ఏమి చేస్తారులే అనుకున్నారో ఏమో తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి చెట్లు అడ్డంగా ఉన్నాయని నరికించారు. మండలంలోని ఎస్బీపల్లి గ్రామంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన సుమిత్రామల్లారెడ్డి కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నారు.
అయితే, ఆ ఇంటికి అడ్డుగా ప్రధాన రోడ్డుపై చెట్లు ఉన్నాయి. వాటిని ఎవరి అనుమతి లేకుండానే నరికి వేయించారు. విషయం తెలుసుకున్న నూతన ఉప సర్పంచ్ గణేశ్, వార్డు సభ్యులు వాట్సాప్ ద్వారా కలెక్టర్, ఆర్డీవో, పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా.. చాలా రోజుల కిందట ఇంటి నిర్మాణానికి చెట్లు అడ్డుగా వస్తున్నాయని వారు చెప్పారని.. వాటిని తొలగించేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు.
