సిటీబ్యూరో/ బండ్లగూడ, జూలై 8 (నమస్తే తెలంగాణ): పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానికంగా ఉన్న వ్యక్తులు తమ దగ్గరున్న ఆధారాలు చూపిస్తూ సర్వే చేయకుండా ఎలా కూల్చేస్తారంటూ జేసీబీలకు అడ్డుపడడంతో పోలీసులు వారిని అక్కడినుంచి పక్కకు జరిపే ప్రయత్నం చేశారు.
దీంతో జేసీబీలకు అడ్డంగా పడుకుని తమ చంపి ఆ తర్వాత స్థలంలోకి అడుగుపెట్టాలంటూ మహిళలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో భారీగా పోలీసులను మోహరించి కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకున్న వారిని పోలీసుల సహకారంతో బలవంతంగా అక్కడినుంచి పక్కకు తప్పించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రహారీని, షెడ్డును కూల్చేశారు.
నోటీసులు ఇవ్వకుండానే..
హైదర్‌గూడలోని గ్రామం సర్వే నెంబర్ 16లోని 1000 గజాల జాగలో ఉన్న పార్క్ స్థలాన్ని కొందరు ఆక్రమించి ప్రహరీని నిర్మించారని నలందానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం భారీ బందోబస్తుతో జేసీబీలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఖాళీగా ఉన్న స్థలం వద్దకు వచ్చి ఇది పార్కు స్థలం అంటూ జేసీబీతో అక్కడ ఉన్న మట్టి దిబ్బలను తొలగించేందుకు హైడ్రా అధికారులు ప్రయత్నించారు. జేసీబీలను అడ్డుకుంటూ కొందరు మహిళలు నేరుగా వాహనాల ముందు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రభుత్వం జారీ చేసిన పట్టాలు ఉన్నాయని, ఆ భూముల్లో తామే అసలైన యజమానులమంటూ బాధితులు వాదించారు.
హైదర్ గూడ సర్వేనెంబర్ 16 లో తమ భూమి ఉందని ఆ భూమి స్థలం తక్కువ వస్తుండడంతో తాము సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు వారు తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలు కూల్చివేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం సర్వే నెంబర్ 16లో ఉన్న భూమి పార్క్‌కు కేటాయించారని, అందులో ప్రహరీ నిర్మాణం అక్రమమని తెలిపారు. హుడా లేఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంలో కబ్జా జరిగిందని, పూర్తివిచారణ జరిపిన అనంతరమే తాము కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.