ఆదిబట్ల, మే 6 : భూమికి భూమైనా ఇవ్వండి.. లేదంటే నష్టపరిహారాన్ని పెంచాలని 100 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లో భూములు కోల్పోతున్న బాధిత రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో 100 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మాణ నిమిత్తం.. ప్రభుత్వం రావిరాల ఎగ్జిట్-13 నుంచి మీర్ఖాన్పేట వరకు ఫేజ్-1 రోడ్డును 18.5 కిలోమీటర్ల పొడవులో ఏర్పాటు చేసేందుకు భూసేకరణ, నష్టపరిహారం, పునరావాసం, ఉపాధి కల్పన కోసం కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ గ్రామాల రైతులతో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ అధికారి రాజుతో తమ బాధను చెప్పుకొన్నారు. ఇప్పటికీ ఎంత భూమి పోతుందో చెప్పడం లేదని.. ఎంత పరిహారమూ చెల్లిస్తారో సమాచారం లేదన్నారు. గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ముందస్తు సమాచారం కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ భూములకు పక్కనే ఉన్న రావిర్యాల గ్రామ రెవెన్యూ భూములకు ప్రభుత్వం రూ.30 లక్షలు చెల్లిస్తున్నదని.. వాటితో పోల్చుకుంటే మూడు రేట్లు ఎక్కువ ధర చెల్లించి నష్టపరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డు వెడల్పులో తమ పేరున ఉన్న భూములే పోతున్నాయని గ్రామానికి చెందిన 10 మంది రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఫాక్స్‌కాన్, కేన్స్ కంపెనీల ఏర్పాటులోనూ భూములు పోయాయని.. కనీసం ఇప్పుడున్న భూములు మిగులుతాయనుకుంటే అవి కూడా నేడు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ పేరుతో గుంజుకుంటున్నారని వాపోయారు. గతంలో తీసుకున్న భూములకు ఇప్పటికీ పరిహారం రాలేదని.. వాటికైనా నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. గతంలోనే కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ గ్రామాలలోని సర్వే నంబర్లు 300, 298, 294, 286, 287, 285, 289, 290, 291, 283 లలో 55 ఎకరాల 5 గుంటలు, ఫిరోజ్‌గూడలోని సర్వే నంబర్ 84లో 2 ఎకరాల 20 గుంటల భూమి మొత్తం 57 ఎకరాల 25 గుంటల భూమిని 42 మంది రైతుల నుంచి సేకరించి హద్దులు కూడా పాతామని గ్రామంలోని నోటీసు బోర్డులో అతికించామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే పని చేస్తామని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గ్రామ సభకు విచ్చేసి గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూ బాధితులతో మాట్లాడారు. బాధితులు కొన్ని సమస్యలను ఆమె దృష్టికి తీసుకురావడంతో వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. రేడియల్ రోడ్డులో 100 శాతం భూములు కోల్పోతున్న బాధిత రైతులు, ఆ భూములపై పూర్తిగా ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబసభ్యులకు (18 సంవత్సరాలు నిండినవారు) ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 5లక్షల50వేల రూపాయలను చెల్లించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అందుకే గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు ఎంత చెల్లించాలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయిస్తుందని.. చట్ట ప్రకారం ముందుకుపోతామని తెలిపారు.
మా పేదోళ్ల భూములే దొరికాయా.. ఉన్నోళ్ల భూముల జోలికి పోతలేరు. గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఫాక్స్‌కాన్, కేన్స్ కంపెనీలకు 8 ఎకరాల భూమి గుంజుకుండ్రు. ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పుడున్న ఒక ఎకరం 38 గుంటల భూమిని కూడా రోడ్డు కోసం తీసుకుంటున్నరు. ఇప్పటికైనా మాకు భూమికి భూమైనా ఇవ్వండి. లేదంటే నష్టపరిహారం పెంచి ఇవ్వాలి. ఇవ్వకుంటే మా బతుకులు రోడ్డు మీదకు వస్తాయి సారూ..
– కౌశిక కోటయ్య, భూ బాధితుడు, కొంగరకలాన్
గతంలో మాకున్న 8 ఎకరాల 20 గుంటల భూమి ఫాక్స్‌కాన్, కేన్స్ కంపెనీల ఏర్పాటులో పోయింది. ఇప్పుడు సర్వే నంబర్ 300లో ఉన్న 4 ఎకరాల తరి పొలం తీసుకుంటుండ్రు. అందులో రోడ్డు ఏస్తరంట. కనీసం ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇస్తరో, ఎంత భూమి పోతుందో కూడా చెప్పడంలేదు. అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు చేస్తున్నారు. గ్రామ సభలు పెడుతున్నరు. ఇప్పటికైనా ప్రతి రైతుకూ నోటీసులు ఇవ్వాలి.
– కౌశిక యాదయ్య, భూ బాధితుడు, కొంగరకలాన్