పెద్దేముల్ : ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహిళలు పక్కగా నేర్చుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో లైవ్లీడ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నాబార్డు కింద ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ మన గ్రామంలో మనకు అత్యంత దగ్గరగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషమని, శిక్షణలో పాల్గొంటున్న ప్రతి మహిళకు ప్రతి రోజు రూ. 50 ఒక పుట భోజనం కూడా పెట్టడం అభినందనీయమని అన్నారు.
ఉచిత శిక్షణ మహిళలకు ఎంతో లాభదాయకమని, అందుకు ప్రతి ఒక్కరూ పక్కాగా కుట్టు మిషన్ శిక్షణ పొందాలని, శిక్షణ అనంతరం ముద్ర, స్టాండప్ ఇండియాలో భాగంగా రూ. 50వేల నుంచి అంతకుపైగా ఎంత పెద్ద యూనిట్ నెలకోల్పాలన్నా కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క మహిళా ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండి స్వతహాగా ఎదడం అనేది చాలా ముఖ్యమని అందుకు ప్రతి ఒక్క మహిళా కుట్టు మిషన్ శిక్షణను పూర్తి స్థాయిలో నేర్చుకొని స్వంతంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో సమాజంలో మంచి వ్యాపారులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అనేది ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, 4 శిక్షణ నిపుణులచే శిక్షణను ఇప్పించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కుట్టూ మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం శిక్షణ నిపుణులతో, మహిళలతో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకొన్నారు. తదుపరి కొంతమంది ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను వివరించగా స్పందించిన కలెక్టర్ అందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ద్యావరి విజయమ్మ, తాసీల్దార్ ఫహీం ఖాద్రి, నాబార్డు జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్డీఎం రాంబాబు, సంస్థ సీఈఓ ఎండీ.గౌస్‌మియా, కోఆర్డినేటర్ అశోక్, శిక్షణ నిపుణులు, గ్రామ వివిధ స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
మా గ్రామానికి ఆసరా పింఛన్లు మంజూరు చేయండి..
పెద్దేముల్ గ్రామానికి ఇప్పటి వరకు ఆసరా పింఛన్లు మంజూరు కాలేదని, చాలా మంది లబ్ధిదారులు ప్రతిరోజు తన ఇంటికి తిరిగిపోతున్నారని అందుకు మా గ్రామానికి ఆసరా పింఛన్లను మంజూరు చేయాలని సర్పంచ్ ద్యావరి విజయమ్మ కలెక్టర్ నిఖిలను కోరారు. అందుకు స్పందించిన కలెక్టర్ బదులిస్తూ తెలంగాణ ప్రభుత్వం 100% శాతం అన్ని రకాల పింఛన్లను మంజూరు చేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా ఆసరా లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో సీఈఓ సెర్ప్ లాగిన్‌లో ఆప్టడెట్ ఉంచడం జరిగిందని, ప్రభుత్వం ఎప్పుడు పింఛన్లను మంజూరు చేస్తే అప్పుడు తప్పకుండా అన్ని పింఛన్లు దశలవారీగా వస్తాయని తెలిపారు.