రంగారెడ్డి. జూన్ 5(నమస్తే తెలంగాణ): బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నరుడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట కార్యక్రమానికి కలెక్టర్ శశాంక ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే ప్రభుత్వం ఉద్దేశమన్నారు.
ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు. బడి బయట పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్య అనేది ప్రాథమిక హక్కు అని, ప్రతి ఒకరూ విద్యను అభ్యసించాలన్నారు. హైదరాబాద్కు చెంతనే ఉండి వేగంగా అభివృద్ధ్ది చెందుతున్న రంగారెడ్డి జిల్లాలో నిర్మాణాలు అధికంగా చేపడుతున్నారన్నారు. ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్న పరిసరాలలో పని చేస్తున్న పిల్లలను గుర్తించి వారందరినీ బడుల్లో చేర్పించేలా చూడాలని టీచర్లకు సూచించారు. అంగన్వాడీలో చదువుతున్న 5 సంవత్సరాల వయస్సు పైబడిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ బడుల్లో ఉన్నత చదువులు చదివి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి చైతన్యపర్చాలన్నారు. పదవ తరగతిలో 9.7 జీపీఏ సాధించిన నరుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కార్తీక వీణ, అనుషలను కలెక్టర్ సతరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, శంషాబాద్ తహసీల్దార్ నాగమణి, ఎంపీడీవో మున్నీ, సీడీపీవో షబానా, ఎంఈవో రాంరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.