వికారాబాద్, జూన్ 24 : ప్రభుత్వం విస్తృతంగా రుణాలు ఇచ్చి మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్నదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా శక్తి కార్యాచరణ ప్రణాళికపై జిల్లా గ్రామీణాభివృద్ధి సిబ్బంది ఏపీఎం, సీసీలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024 -25 సంవత్సరం కింద చేపట్టాల్సిన 14 రకాల పథకాలపై మహిళల్లో అవగాహన కల్పించి లబ్ధిదారుల ఎంపికపై శనివారంలోగా కసరత్తు చేపట్టాలన్నారు.
100 రోజుల ప్రణాళికలో భాగంగా 2024- 25 కు సంబంధించి 9,722 యూనిట్లకు 11,354 లక్షల రూపాయల రుణాలకు గ్రౌండింగ్ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. 14 రకాల పథకాలలో భాగంగా పెరటి కోళ్ల పెంపకం, మండల స్థాయిలో క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సామూహిక పప్పు ధాన్యాల సేకరణ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర యూనిట్ ల ఏర్పాటుకు ముందుకు వచ్చే మహిళలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, లీడ్ బ్యాంకు మేనేజర్ యాదగిరి, అడిషనల్ డీఆర్డీవో సరోజ, డీపీఎంవో రామమూర్తి, శ్రీనివాస్, వీరయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.