బొంరాస్‌పేట/కొడంగల్, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించడానికి శనివారం బొంరాస్‌పేట, కొడంగల్ మండలాల్లోని ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ నగేశ్, సాంకేతిక విద్య జాయింట్ డైరెక్టర్ రాజేందర్‌సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రెవెన్యూ ఏడీ రాంరెడ్డి శనివారం పరిశీలించారు.
బొంరాస్‌పేటకు సమీపంలోని తాండూరు రోడ్డు పక్కన ఉన్న సర్వే నం.760, 691 భూములను పరిశీలించారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రాణి కుముదినికి కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వారు ప్రభుత్వ భూములకు సంబంధించిన మ్యాపులను పరిశీలించి సర్వే అధికారులతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధికి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ‘కడా’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట కూడా కలెక్టర్ బొంరాస్‌పేటకు వచ్చి రెండు సర్వే నెంబర్లలోని భూములను పరిశీలించి వెళ్లారు. బొంరాస్‌పేట నుంచి కొడంగల్‌కు వెళ్లిన అధికారులు మండలంలోని బుల్కపూర్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం అక్కడి అధికారులతో సమావేశమై చర్చించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐ రవిచారి ఉన్నారు.