ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి కలెక్టర్ గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజాపాలన కార్యక్రమ అమలుకు రూపొందించాల్సిన ప్రణాళికపై జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు చేపట్టనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ముందుగా 1000 లోపు జనాభా గ్రామాలను తీసుకోవాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక దరఖాస్తు అందేలా రోజుకు రెండు గ్రామాల చొప్పున ప్రతి గ్రామపంచాయతీలోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
వారం వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రజలకు వివరించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, డిప్యూటీ తహసీల్దార్లు టీంలుగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక్క కౌంటర్ చొప్పున ఐదు కౌంటర్స్ ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేయాలన్నారు. 28, 29 తేదీల్లో చిన్న గ్రామపంచాయతీలు తీసుకుని 30వ తేదీ నుంచి పెద్ద గ్రామపంచాయతీలను ప్రణాళికలోకి తీసుకోవాలన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలు, వార్డులవారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాపాలన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.
దరఖాస్తులను ప్రభుత్వమే ప్రజలకు అందజేస్తుందని.. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు అర్హులైనవారు దరఖాస్తులు అందించాల్సి ఉంటుందన్నారు. ప్రజా పాలనపై ప్రతి గ్రామంలో మున్సిపల్ వార్డుల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లాలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.