సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్క్రీం పార్లర్లు ఇతర వాటిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది.
ఇందులో భాగంగానే నారాయణగూడలోని ఇండియన్ దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో అప్రరిశుభమైన వాతావరణం, బొద్దింకల బెడద ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిన టమాట, పచ్చిమిర్చి, క్యారెట్లు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేల్చారు. లక్డీకాపూల్లోని హోటల్ అశోకలోనూ అధికారులు తనిఖీలు చేపట్టగా, వంటగది గోడలు అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన వస్తుండడాన్ని గమనించారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.