రంగారెడ్డి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ఫాక్స్‌కాన్ కంపెనీ ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులను కోరారు. ప్రారంభానికి సిద్దంగా ఉన్న కొంగర కలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతోపాటు శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు పాల్గొన్నారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను కంపెనీ ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా.. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా అక్కడికక్కడే సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ ఫాక్స్‌కాన్ ప్రతినిధులను కోరారు.
బీఆర్ఎస్ హయాంలో బీజం..
ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు బీఆర్ఎస్ హయాంలో బీజం పడింది. కంపెనీ తొలి దశ ఉత్పత్తులకు సంబంధించిన పనులు చివరి దశకు చేరాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులైన ఫాక్స్‌కాన్ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో రూ.4,600కోట్ల వ్యయంతో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. అప్పటి సీఎం కేసీఆర్‌తో కంపెనీ ప్రతినిధి బృందం సమావేశమయ్యాక పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్దతను తెలిపింది. మొదటి దశలో రూ.2,640కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తులను ప్రారంభించేందుకు గత యేడాదే సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మేరకు గత యేడాది మే 15న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.
ఈ మేరకు కంపెనీని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులు పనులు వేగవంతం చేశారు. ఉత్పత్తులకు సంబంధించి అన్నిరకాల పనులు ముగింపు దశకు వచ్చాయి. త్వరలోనే కంపెనీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్ కంపెనీని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటైన ఈ కంపెనీ తొలి దశలోనే 35వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నది. ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలో ఉన్న ఈ ప్రాంత నిరుద్యోగులకు ఫాక్స్‌కాన్ ఆశాదీపంలా నిలవనున్నది.