సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో వందేండ్ల ప్రగతిని సాధించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్, మర్పల్లి మండలాల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నదన్నారు. గడప గడపకూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ ఫలాలతో లబ్ధి పొందని కుటుంబమంటూ లేదన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశ పెడుతూ పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. -వికారాబాద్/మర్పల్లి, మే 20
వికారాబాద్, మే 20/మర్పల్లి : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మర్పల్లిలో రూ.42.73 లక్షలతో గ్రంథాలయ భవనం, రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన కల్ఖోడా విద్యుత్ సబ్‌స్టేషన్, మర్పల్లిలో రూ.కోటితో నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. వికారాబాద్ పట్టణం కొత్తగడిలో విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్యలతో కలిసి శంకుస్థాపన చేశారు.
కులవృత్తులను ఆదుకునే దిశగా..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే చీకటి అవుతుందనే మాటలను పటాపంచలు చేస్తూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా కృషి చేశారన్నారు. ఈ విషయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందన్నారు. కమ్మరి, కుమ్మరి కులవృత్తులతో పాటు ఇతర వృత్తులవారిని ఆదుకునే దిశగా కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రైతుల పంటల పెట్టుబడికి ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు అందించడంతోపాటు రైతు బీమా డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. రైతు ఏ కారణంతో మరణించినా 15 రోజుల్లో నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
యువతకు ఉపాధి
సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.లక్షా నూటపదహార్లు అందిస్తూ పేదింటి ఆడబిడ్డలను మేనమామలా ఆదుకుంటున్నారని మంత్రి కొనియాడారు. యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు వీలుగా పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేయడం జరుగుతున్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రంలో పలు కంపెనీలు పెట్టేందుకు యాజమాన్యాలు ముందుకు వస్తున్నారన్నారు. మోమిన్‌పేట్ మండలంలోని ఎన్కతల గ్రామ సమీపంలో కంపెనీ ఏర్పాటు చేయడంతో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు.
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తయితే వికారాబాద్ ప్రాంతానికి సాగు నీరు అందుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతుల ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమ చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధుల కోరిక మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే ఆనంద్ ‘మీతో నేను’ అనే కార్యక్రమంతో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం జూన్ 2 నుంచి 21 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా జరుపనున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలన్నారు. ప్రతి గ్రామానికి వివిధ పథకాల ద్వారా కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. గ్రామాల్లో ఎంతమంది ఈ పథకాల ద్వారా లబ్ధి పొందారో తెలుపాలని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంలో పుష్కలంగా సాగు నీరు అందుతున్నదన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందుతున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకు ముందు మహిళా సమాఖ్య కొనుగోలు చేసిన ట్రాక్టర్‌కు పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సంగీత, రైతు బంధు సమితి జిల్లా, మండల అధ్యక్షులు రామ్‌రెడ్డి, నాయబ్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌గుప్తా, మధుకర్, అశోక్, గఫార్, ఖాజా, రాచయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులున్నారు.