వికారాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : స్థానికుడు, యువకుడైన రోహిత్‌రెడ్డిని గెలిపిస్తేనే తాండూరుకు మంచి జరుగుతుందని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని విలియంమూన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజాశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కాంక్షిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోహిత్‌రెడ్డి నిజాయతీగా నిలబడిన మనిషి అని, మన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపోళ్లు కుట్ర చేస్తే వారిని పట్టించి జైలుకు పంపించిండన్నారు.
నిజాయతీగా నిలబడి తాండూరులో బ్రహ్మాండంగా పనిచేస్తున్న రోహిత్‌రెడ్డి అడిగినవన్నీ కాదనకుండా మంజూరు చేస్తున్నామన్నారు. తాండూరు వెనుకబడిన ప్రాంతమని.. రోహిత్‌రెడ్డి విన్నవించిన తాండూరుకు పీజీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, తట్టేపల్లి వద్ద రిజర్వాయర్, సబ్‌కోర్డు, పీజీ కాలేజీ, కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులకు నిధులు తదితర కోరికలన్నీ నూటికి నూరు శాతం నెరవేరుస్తామన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజాశీర్వాద సభకు తరలివచ్చారంటే తాండూరులో పైలట్ రోహిత్‌రెడ్డి గెలుపు ఖాయమన్నారు. నవంబర్ 30న ఇదే ఉత్సాహంతో పైలట్ రోహిత్‌రెడ్డిని గెలిపించండి, తాండూరు నియోజకవర్గానికి భారీ అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాదని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు.
తాండూరులో బీఆర్ఎస్ పార్టీ తరఫున రోహిత్‌రెడ్డి నిలబడ్డారని, వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరుగా ఉంటారని, అభ్యర్థుల గుణగణాలతోపాటు వారి పార్టీల గత చరిత్ర కూడా ఏందనేది చూడాలన్నారు. ఆయా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వారి నడవడిక సమాజం, రైతులు, పేదల పట్ల వారి దృక్పథం, వైఖరి చూసి ఓటేస్తే చాలా లాభం ఉంటుందన్నారు. గత 50 ఏండ్లలో ఏం జరిగింది, పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందనేది పోల్చి చూడాలని, గత కాంగ్రెస్ పాలనలో తాండూరు ప్రజలు కాగ్నా నది వద్ద గుంతలు తీసి వడబోసి నీళ్లు తాగిన సంఘటనలు మీరు మరిచిపోయిండ్రని అనుకోవట్లేదన్నారు.
కానీ ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందించిందన్నారు. గతంలో అర్ధరాత్రి కరెంట్ పెట్టబోయి తాండూరులో 30 మందికిపైగా విద్యుత్ షాక్‌తో, పాములు కరిచి చనిపోయినా ఏ నాయకుడూ పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. మన ప్రభుత్వం రోడ్లు, చెరువులు, చెక్‌డ్యాంలు, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను మంచిగా చేసుకున్నామని, తాండూరులోనే భూగర్భజలాలు ఎంత బాగా పెరిగాయో మీ కండ్లారా చూస్తున్నారన్నారని, ఇదంతా మన ప్రభుత్వం ఘనతేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతు బంధు దుబారా అంటున్నాడని.. కానీ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ప్రజలు రైతు బంధు కావాలంటున్నారన్నారు. తాండూరులో రోహిత్‌రెడ్డిని గెలిపించండి, మన రైతుబంధు మనకే ఉంటదని, పైగా రూ.10 వేలకు బదులు రూ.16 వేలు పెంచుతామన్నారు. కత్తి ఒకరికిచ్చి యుద్దం మరొకరిని చేయమంటే ధర్మం కాదు.. తాండూరులో రోహిత్‌రెడ్డి గెలిస్తేనే రైతుబంధు ఉంటదన్నారు. మూడు గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని, కానీ ప్రజలేమో 24 గంటల కరెంట్ కావాలని కోరుతున్నారన్నారు.
కేసీఆర్ ప్రజలకేది కావాలో అదే చేస్తడని, తాండూరులో రోహిత్‌రెడ్డి గెలిస్తేనే 24 గంటల కరెంట్ ఉంటదని.. లేకుంటే ఆగమైపోతదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని, తాండూరోళ్లు కర్ణాటకకు రోజూ పోయి వస్తుంటరు, మీకందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, తాండూరులోని 24 తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తే గిరిజనులే సర్పంచులుగా ఉన్నారని, రాజ్యం ఏలుతున్నారన్నారు. మరోవైపు నా మాటపై మంత్రి మహేందర్‌రెడ్డి పెద్ద మనసుతో రోహిత్‌రెడ్డికి ఆశీస్సులు అందిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
రోహిత్‌రెడ్డిని
– మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రోహిత్‌రెడ్డి పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చారని, రోహిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి గత ఐదేండ్లలో రూ.3-4 వేల కోట్ల నిధులిచ్చారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
ఇంటోడు ఇంటోడే..
తాండూరు బిడ్డ అభివృద్ధి చేస్తుంటే అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని, తాండూరులో ఇతర పార్టీల తరఫున పోటీ చేస్తున్న పరాయి వ్యక్తులను తరిమికొట్టాలని, ఇంటోడు ఇంటోడే.. బయటోడు బయటోడేనని బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. తాండూరును ఆగం చేసుకోవద్దని, అభివృద్ధి చేసేందుకు మరో అవకాశమివ్వాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, మళ్లీ మీ ముందుకు వచ్చానని, మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. తాండూరు మండలానికి పాలిటెక్నిక్ కాలేజీ, పీజీ కాలేజీ, సబ్ కోర్డును మంజూరు చేయాలని, తాండూరు కందిపప్పుకు ప్రసిద్ధి కాబట్టి కంది బోర్డు లేదా పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేయాలన్నారు.
తట్టేపల్లి రిజర్వాయర్‌ను, కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకీకరణకు, జంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టుకు నిధులివ్వాలని, కోట్‌పల్లి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం, నాపరాతి పరిశ్రమలకు విద్యుత్తు రాయితీ, ఉల్లి రైతులకు కోల్డ్ స్టోరేజీ, ప్రభుత్వ అతిథిగృహాన్ని మంజూరు చేయాలన్నారు. తాండూరుకు ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, ఎస్డీఎఫ్ కింద రూ.134 కోట్ల నిధులిచ్చారని, ఈ నిధులతో ప్రతి గ్రామానికి రూ.50 లక్షలు, వార్డుకు రూ.కోటి నిధులిచ్చామన్నారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటేసి తాండూరు సత్తా ఏందో చూపెట్టాలని పైలట్ కోరారు. ఈ సభలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, స్పీకర్ మధుసూదనచారి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీశైల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సుశీల్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.