కొడంగల్, అక్టోబర్ 24 : కొడంగల్ అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలని, విద్యాలయాలను తరలించకుండా ఇక్కడే నిర్మించాలని కొడంగల్ అభివృద్ధి ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ) జేఏసీ నాయకులు సీఎం సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలో స్టేడియం నిర్మాణం, మార్కెట్ కమిటీ కార్యాలయం, పట్టణ ప్రధాన రహదారి అభివృద్ధి, మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంలో నిర్వాసితులకు చెక్కుల పంపిణీకి ఆయన రాగా వారు వినతిపత్రాన్ని అందజేశారు. కొడంగల్ అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలని కోరగా ఆయన పట్టించుకోకపోవడంతో కేడీపీ జేఏసీ నాయకులు అసహనం, నిరసన తెలిపారు.
రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో కొడంగల్వాసులకు ఆశలు చిగురించాయన్నారు. ముఖ్యమంత్రి మొదట్లో కొడంగల్‌కు మెడికల్, వెటర్నరీ కళాశాలలతోపాటు సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టగా కొడంగల్ ప్రజల ఆశలు నెరవేరుతున్నాయని సంతోషించేలోపే నిరాశ మిగిల్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి మంజూరైన విద్యాలయాలను దుద్యాల మండలంలోని లగచర్ల ప్రాంతానికి తరలించొద్దని గత 20 రోజులుగా ఆందోళన, నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు.
కొడంగల్ పట్టణానికి వచ్చిన తిరుపతిరెడ్డికి వినతిపత్రాన్ని ఇస్తే.. పట్టించుకోకపోవడంతో కేడీపీ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. కొడంగల్ అభివృద్ధికి, మంజూరైన విద్యాలయాలను ఈ ప్రాంతంలోనే నిర్మించేలా పోరాడుతామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో కేడీపీ జేఏసీ నాయకులు కోట్రికె లక్ష్మీనారాయణ, ఎరన్‌పల్లి శ్రీనివాస్, గంటి సురేశ్‌కుమార్, రమేశ్‌బాబు, పవన్లాహోటీ, శాంతకుమార్, నర్మదాకిష్టప్ప, నవాజోద్దిన్, విఖార్ తదితరులు పాల్గొన్నారు.