రంగారెడ్డి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)‘ ; రంగారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా సర్వర్ సమస్య కారణంగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనులు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. జిల్లాలో భూముల క్రయవిక్రయాలు కూడా అత్యధికంగా ఉంటున్నందున రిజిస్ట్రేషన్లకు అదే స్థాయిలో డిమాండ్ ఉన్నది. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్‌చేసుకున్నవారు తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రారంభంలోనే డౌన్లోడ్ సమస్య తలెత్తుతున్నది. ఒక్కొక్క రిజిస్ట్రేషన్‌కు గంటల తరబడి సమయం పడుతున్నది. ఒక్కోరోజు పూర్తిగా రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోతున్నాయి. దీంతో మరో రోజుకు స్లాట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క స్లాట్‌ను మూడుసార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. సర్వర్ సమస్యతో స్లాట్ కాలపరిమితి కూడా ముగిసిపోతున్నది. సర్వర్ సమస్య గురించి అడిగితే పై అధికారులకే తెలియాలని తెలివిగా తప్పించుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గంటసేపట్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి పాస్‌బుక్కులు కూడా చేతికందేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ భూములు తాము అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని వాపోతున్నారు.
మీ సేవ’ల్లోనూ ఇదే దుస్థితి
భూముల రిజిస్ట్రేషన్ కోసం మీ సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాలన్నా సులువుగా సాధ్యం కావడంలేదు. మీ సేవల్లో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తి స్లాట్ బుక్ కావడానికి తీవ్ర జాప్యం జరుగుతున్నది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని స్లాట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుత్నుది. స్లాట్ బుక్కైన తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ సమస్య జిల్లా రైతులను, క్రయవిక్రయదారులను తరచుగా వేధిస్తున్నది. దీనిపై ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ముందుకు సాగని సేవలు
సర్వర్ సమస్యలతో తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా పౌర సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి మ్యుటేషన్లు, టీఎం33లో భాగమైన మిస్సింగ్ సర్వే నంబర్లు, పేర్ల తప్పొప్పులు, విస్తీర్ణంలో మార్పులు, చేర్పుల వంటి పనులు కూడా సర్వర్ సమస్యతో ముందుకు సాగడంలేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 20వేలకు పైగా దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ లాగిన్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
సర్వర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం
రిజిస్ట్రేషన్ల విషయంలో తరచుగా సర్వర్ సమస్య ఏర్పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. స్లాట్ బుక్ అయినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం రిజిస్ట్రేషన్లు ముందుకు సాగడంలేదు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు డౌన్లోడ్ కాకపోవడంతో ఎక్కడికక్కడే రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. ఒక్క రిజిస్ట్రేషన్ కోసం రెండు మూడు రోజులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. సర్వర్ సమస్యకు పరిష్కారం చూపాలి.
-మహేశ్, డాక్యుమెంట్ రైటర్