సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో ఇద్దరు మహిళలు ఉండటం మరింత విశేషం. వీరి లక్ష్యం ఒక్కటే. అది ‘సైక్లింగ్ వినియోగం పెరగాలి. పర్యావరణ కాలుష్యం తగ్గాలి. ఆరోగ్యంగా జీవించాలి’. ఇదే నినాదంతో నగరానికి చెందిన హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ సభ్యులు కశ్మీర్ టూ కన్యాకుమారి సైకిల్ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. సైక్లింగ్ ప్రాధాన్యతను చాటేలా విభిన్న రకాల బ్యానర్లు, కరపత్రాలు ప్రదర్శిస్తూ 23 రోజుల పాటు సైక్లింగ్ చేశారు. దేశంలో తెలంగాణ నుంచి రెండుసార్లు ‘కేటీకే’ గ్రూప్ రైడ్ చేసిన ఘనత హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్‌దే కావడం విశేషం. దారి పొడవునా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఆర్మీ అధికారులు తమ రైడ్‌కు ప్రోత్సాహం అందించారని ఫౌండర్ రవీందర్ తెలిపారు. నమస్తే తెలంగాణతో ఆయన కేటూకే రైడ్ విశేషాలను పంచుకున్నారు.
ఇదొక అపూర్వ విజయం
కేటూకే రైడ్ చేయడం లక్కీగా ఫీలవుతున్నాను. ఈ యాత్ర చేయడానికి చాలా రోజుల నుంచి కసరత్తు చేశాం. సైక్లింగ్ వినియోగం పెరగాల్సిన అవసరం అందరికి తెలియాలనేదే మా సంకల్పం. కన్యాకుమారి చేరుకున్నాక యాత్ర ముగించాం. అక్కడున్న అందరికి సైక్లింగ్ ఆవశ్యకతపై అవగాహన కల్పించాం.
-చైత్ర నటరాజన్, హెచ్‌సీజీ
అవరోధాలను పక్కనబెట్టి
సైక్లింగ్ రైడ్‌లో అక్కడక్కడ చాలా అవరోధాలు ఎదురయ్యాయి. అయినా మేం వెనకడుగు వేయకుండా ముందుకెళ్లాం. కేటూకే రైడ్ చేయడం సంతోషంగా ఉంది. హెచ్‌సీజీ అనేక కార్యక్రమాలతో సైక్లింగ్ వినియోగానికి కృషి చేస్తుంది. నగరవాసులకు సైక్లింగ్‌పై అవగాహన కల్పించి సక్సెస్ అయిన హెచ్సీజీలో సభ్యులుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్న. -బృంద, జువెల్లరీ డిజైనర్, సైక్లిస్టు.
యాత్ర సాగిందిలా..
3,700 కిలో మీటర్ల కే2కే రైడ్ నవంబర్ 30న ప్రారంభమైంది. శ్రీనగర్ నుంచి రాంబాన్, పటాన్‌కోట్, జలంధర్, అంబాలా మీదుగా ఢిల్లీ, మధుర, గ్వాలియర్, సాగర్, లక్నడన్, నాగపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కర్నూల్, అనంతపూర్, బెంగళూరు, ధర్మపురి, కరూర్, మధురై, తిరునల్వేలి, కన్యాకుమారి వరకు చేరుకొని 12 మంది రైడర్స్ ఔరా అనిపించారు. 2022 డిసెంబర్ 22న ఈ యాత్ర ముగిసింది. మార్గమధ్యంలో పర్యావరణ కాలుష్యం, సైక్లింగ్ వాడకం వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ రైడ్ 23 రోజులు సాగింది. హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఫౌండర్ వి. రవీందర్ ఆధ్వర్యంలో ఈ రైడ్ ముగిసింది.
ఆదర్శంగా నిలిచిన రైడర్స్ వీరే..
ఆర్మీ బాక్సింగ్ కోచ్ అలెగ్జాండర్, జాతీయ వాలీబాల్ ప్లేయర్, ఫిట్నెస్ ట్రెయినర్ జన్ని గాంధీ, సూపర్ రాండోనియర్ టైటిల్ విజేత అచ్యుత్ యలవర్తి, జువెల్లరీ డిజైనర్ సూపర్ రాండోనియర్ టైటిల్ విజేత బృంద ఒబులాంపల్లి, ఆల్ట్రాఎండోరెన్స్ సైక్లిస్టు, ఎస్ఆర్ టైటిల్ విజేత జి. జనార్దన్, సూపర్ రాండోనియర్ టైటిల్ విజేత జి. ఉమా మహేశ్, పోడియం ఫినిషర్, ఎస్ ఆర్ టైటిల్ విజేత చైత్ర నటరాజ్, సీనియర్ సైక్లిస్టు హరీశ్ రెడ్డి, ఫిట్నెస్ ట్రెయినర్ అనిల్ కుమార్ మెడారమెట్ల, స్విమ్మింగ్ ఎక్స్పర్ట్ బండ్లముడి సుబ్బయ్య, స్టేట్ లెవల్ స్విమ్మర్ భవేశ్ జైస్వాల్, మారథాన్ ఎక్స్పర్ట్ శివకుమార్ దేవాంగ్లు ఈ సాహస రైడ్‌లో పాల్గొని సైక్లింగ్ రైడ్‌ను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు.
హ్యాట్రిక్ కేటూకే రైడ్‌కు ప్లాన్ చేస్తున్నాం
సైక్లింగ్తోనే ఆరోగ్యం. సైక్లింగ్తోనే కాలుష్యం తగ్గుతుంది. సైక్లింగ్ వినియోగం పెంచడం కోసమే నేను హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఏర్పాటు చేశాను. సైక్లింగ్ ట్రాక్‌లు కూడా నగరంలో ఏర్పాటు చేయబోతుండటం గొప్ప విషయం. ప్రభుత్వం ఆ మేరకు ప్రోత్సాహం అందిస్తుంది. అనేక చాలెంజెస్‌తో సైక్లిస్టులు విభిన్న రకాల రైడ్లను పూర్తి చేశారు. ఇప్పటికి రెండుసార్లు కశ్మీర్ టూ కన్యాకుమారి రైడ్ చేశాం. హ్యాట్రిక్ రైడ్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.
-వి.రవీందర్, ఫౌండర్, హెచ్‌సీజీ