మొయినాబాద్, ఫిబ్రవరి 21 : చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి పలు ఆలయాల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణ లో వెల్లడైంది. కోర్టు అనుమతితో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడు రోజులపాటు విచారించి నివేదికను కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం శుక్రవారం రాజేంద్రనగర్ మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చారు.
దేశంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం లేకపోవడంతో అతడు సొంతంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో 2022లో రామరాజ్యం పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన వీరరాఘవరెడ్డి అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ని హిందూ దేవాలయాలకు వెళ్లి అర్చకులతో మాట్లాడుతూ.. రామరాజ్యం స్థాపన ఉద్దేశాల ను వివరిస్తూ వారి మద్దతూ తీసుకుంటున్నాడు. రామరాజ్య స్థాపనకు తమకు సహకరించాలని కోరుతూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
హిందూ ధర్మాన్ని కాపాడేందుకు రామరాజ్యం సైన్యంలో ఆసక్తి ఉన్న వారు చేరాలని ప్రతినెలా రూ. 20 వేల వేతనం ఇస్తామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో గత నెల 25 మంది రామరాజ్యం సైన్యంలో చేరారు. అనంతరం వారు హైదరాబాద్‌లోని దమ్మాయిగూడ నుంచి నేరుగా చిలుకూరు బాలాజీ ఆలయానికెళ్లి అర్చకుడు రంగరాజన్‌ను రామరా జ్యం సైన్యానికి కొంత మంది సైనికులను పంపాలని, సైనికులను పంపిన తర్వాత వారికి నిధులను సమకూర్చాలని డిమాండ్ చేశాడు. వీర రాఘవరెడ్డి డిమాండ్‌కు అంగీకరించకపోవడం తో ఆయనపై దాడి చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
వీటితోపాటు పలు కీలక విషయాలను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. వీరరాఘవరెడ్డికి డబ్బులు ఇచ్చిన వారు నగదు రూపంలో ఇచ్చారా..? బ్యాంకు ఖాతాలో జమ చేశారా..? అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుడి ఖాతాలోకి ఎవరెవరి ఖాతాల నుంచి డబ్బులు వచ్చాయనే అంశాలపై ఆరా తీశారు. ఆయనతో ఫోన్లో ఎవరెవరు మాట్లాడారు? తదితర విషయాలను సైతం సేకరించి నివేదికలో పొందు పర్చినట్లు తెలిసింది. వీర రాఘవరెడ్డిని కో ర్టులో జడ్జి ముందు హాజరు పర్చి అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.