ఇబ్రహీంపట్నంరూరల్, మే 14 : పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడం ద్వారా వారి అభిరుచి మెరుగుపర్చుకునేందుకు తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. ప్రస్తుతం మనమున్నది పోటీ ప్రపంచం కావడంతో పిల్లల్ని వినోదాల ద్వారా కాలక్షేపం కోసం వదిలేయకుండా వారిలోని స్కిల్స్‌ను మెరుగుపర్చే శిక్షణ ఇప్పించేందుకు కృషి చేయాలి. పెద్ద పిల్లలైతే వారు చదివే కోర్సుకు ఉపయోగపడే అదనపు విషయాలను నేర్పే చోటికి పంపాలి. క్రీడలతో పాటు అనేక రకాలుగా మన జీవితంలో ఉపయోగపడే విషయాలను పిల్లలు నేర్చుకునేలా చూడటంతో పాటు వారు పోటీ ప్రపంచంలో దూసుకుపోయే విధంగా తర్ఫీదునిప్పించాలి.
ఆధునిక సమాజంలో విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ప్రత్యేకంగా సెలవుల్లో నేర్పుకొని సాధన చేస్తే భవిష్యత్‌కు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనుకబడిపోతున్నారు. మనదేశంలో ఒక ప్రముఖ సంస్థ ఈ విషయమై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్నారని తెలిపింది. సెలవుల్లో వీటిని నేర్చుకోవడం ద్వారా సెలవులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది. జీవితంలో ఉపయోగపడే విషయాలను పిల్లలు నేర్చుకునేలా చూడటం ద్వారా సెలవులు ఈజీగా గడిపేయవచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు.
చిన్నారుల మెదడును చురుకుగా ఉంచాలంటే దానికి ఎప్పుడు ఏదో పని చెప్పాలి. అందుకే పిల్ల మెదడును చురుకుగా ఉంచే ప్రతిప్రయత్నాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. చదరంగం ఆట, సుడోకు లాంటి పజిల్స్ మెదడును ఉత్తేజ పరుస్తాయి.
నేటి ఆధునిక యుగంలో ఏ భాషలోనైనా పట్టుసాధించాలి. అందుకు దానికి సంబంధించిన పద పరిజ్ఞానం ఎంతో అవసరం. పదం కోసం పరితపించే సంభాషణను చేస్తూ ఉంటే పదాల గురించి కుస్తీపట్టే పనుండదు. మనపేరు గుర్తుకొచ్చినంత సులభంగా పదాలు గుర్తుకొస్తాయి. స్కూల్, కళాశాలలో చదువుతున్న రోజుల్లో అంత సమయం ఉండదు. కాబట్టి సెలవుల్లో పద పరిజ్ఞానంపై దృష్టి పెడితే భాషపై పట్టు సాధించడం సులభమవుతుంది.
పరీక్షల్లో చేతిరాత చాలా ముఖ్యం. ఏ పరీక్ష అయినా రాసే సమాధానాలను మంచి చేతిరాతతో రాస్తే చదవడానికి ఎంతో బాగుంటుంది. దీంతో ఆయా పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశముంది. పాఠశాలలో చేతిరాత బాగాలేక టీచర్లచేత చివాట్లు తిన్న వారంతా ఈ సెలవుల్లో చేతిరాత మెరుగుపరిచే శిక్షణా తరగతులకు వెళ్లడం మంచిది. పట్టణాల్లో కాలిగ్రఫీ నిపుణులు ప్రత్యేక శిక్షణ తరగతులు పెట్టి చేతిరాతపై శిక్షణ ఇస్తుంటారు. వీటికి సంబంధించిన డీవీడీలు, పుస్తకాలు కూడా మార్కెట్లో లభిస్తాయి. రోజుకి గంట సమయాన్ని కేటాయిస్తే మీ చేతిరాతను మెరుగుపర్చుకోవచ్చును.
భాషమీద పట్టు అవసరం. అది తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు. తెలుగు మాతృభాష అయితే ఇంగ్లీష్ బతుకు నేర్పే భాష. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మాట్లాడటానికి ఇంగ్లీష్ అవసరం. భాష వేరు కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు. భాష అనేది అందులో ఒక భాగం మాత్రమే. కాబట్టి భాష మీద పట్టులేకపోతే కమ్యూనికేషన్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వేసవి సెలవుల్లో భాషపై దృష్టి పెడితే అది జీవితకాలమంతా మనల్ని కాపాడుతుంది. ఒక స్థాయిలో నిలబెడుతుంది.
నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగం లేనిదే ఏ పని జరుగడంలేదు. నేడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం. రానున్న రోజుల్లో ఉద్యోగ పరీక్షలన్నీ ఆన్లైన్లోనే జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కంప్యూటర్ టెక్నాలజీని నేర్చుకోవడం ఎంతో అవసరం. ఎంఎస్‌వర్డ్, ఎంఎస్ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ వస్తే వివిధ ఆఫీసుల్లో చిన్నచితక ఉద్యోగాలు గ్యారంటీ. మీ సొంతం పనులకు వేరే వారిపై ఆధారపడకుండా మీరే చేసుకోవచ్చు. కాబట్టి వేసవి సెలవుల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి.
సెలవుల్లో రోజుకి గంట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లల్లో ఉత్తేజాన్ని కలిగించేవి, వారి భవిష్యత్‌కు, పరిజ్ఞానాన్ని ఉపయోగపడే పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచి అవి చదివేలా చూడాలి. ఉదాహరణకు సమయ పాలన, భావోద్వేగాల అదుపు, మైండ్మెసేజ్, వంటి పుస్తకాలు చదివితే విద్యార్థుల్లో ఉత్తేజంతో పాటు ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
వ్యాయామాలు ఫిజికల్‌గా, ఫిట్‌గా ఉంచుతాయి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. మీలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి. రోజుకు గంటపాటు వ్యాయామాలు చేస్తే మరోపూట తప్పక ఆటలు ఆడండి. వేసవిలో కొంతమంది ప్రత్యేక శిక్షక్షులు వ్యాయామాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. వీటికి హాజరు కావడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటు ఏకాగ్రత, మెమరీ ప్రాసెస్కూడా మెరుగవుతాయి.
స్విమ్మింగ్ అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైనది. స్విమ్మింగ్ కోసం ప్రత్యేకించి సమయం లేకపోవటం వలన ఎక్కువమంది ఈతకు దూరమవుతున్నారు. వేసవిసెలవుల్లో దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ఫూల్స్కు వెళ్లి ఈత నేర్చుకోవటం ఎంతో అవసరం. ఇందుకనుగుణంగా స్విమ్మింగ్ఫుల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా స్విమింగ్ ఉదయం, సాయంత్రం వేళలో అనుకూలంగా ఉంటుంది.
జీవన రంగంలో అత్యున్నత స్థానాలను అందుకొని పలువురికి ఆదర్శంగా ఉన్న స్ఫూర్తిదాతల ప్రసంగాలను వినడాన్ని పిల్లలకు అలవాటు చెయ్యాలి. అవి పిల్లలను ఆశాజనకమైన భవిష్యత్తువైపు నడిపిస్తాయి. ఈ వేసవి సెలవుల్లో రోజు ఒకగంట సమయాన్ని కేటాయించి అంతర్జాలంలో ఉన్న వీరి ప్రసంగాలను విన్నవారంతా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ఎన్నో అనుభవాల్ని సొంతం చేసుకుంటారనే విషయం వారికి తెలియజేయాలి.
చాలా మంది విద్యార్థులు గణితశాస్త్రంలో మంచి మార్కులు సాధించడానికి ఎబాకస్వేరు గణితం, స్పీడు మాథ్స్లాంటి ప్రత్యేక విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. వేసవిసెలవుల్లో బాగా సాధన చేసి స్కూల్ తిరిగి ప్రారంభించిన తరువాత వారి ప్రతిభను పెంచుకుని మంచి మార్కులను సంపాదించుకోవచ్చు. నేర్చుకునే సమయంలో ఇష్టంతో నేర్చుకోవడాన్నే ఎంజాయ్మెంట్ అని విద్యార్థులకు తల్లిదండ్రులు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ దిశగా వారిని అలవాటు చెయ్యాలి.
సెలవురోజుల్లో సమయాన్ని వృథా చేసుకోకుండా, వారి దృష్టి ఇతర విషయాలపైకి వెళ్లకుండా వ్యాయామం, విద్య, వినోదం లాంటి వాటిపై దృష్టి సారించే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక చొరువ తీసుకోవాలి. పాఠశాలలకు వెళ్లినప్పుడే చదువుకోవాలనేది కాకుండా సెలవు రోజుల్లో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు జీవితంలో సాధించాల్సిన వాటిపై దృష్టి సారించేందుకు కృషి చేయాలి.
-మహేందర్, ప్రధానోపాధ్యాయుడు
విద్యార్థులు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట, రెండు గంటల పాటు క్రీడలు, వ్యాయామంపై దృష్టి సారిస్తే నూతన ఆలోచనలు వస్తాయి. మెమరీకూడా షార్ప్‌గా అవుతుంది. తల్లిదండ్రులు సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృథా చేసుకోకుండా చూసుకోవాలి. వ్యాయామంతో పాటు బాడిఫిట్గా ఉండటంతో పాటు విద్యలో కూడా ముందుంచేందుకు ఎంతో కృషిచేస్తుంది.
-కౌశిల్రెడ్డి, వైద్య నిపుణులు