చేవెళ్లటౌన్ : ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వైద్యులకు సూచించారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు దవాఖానలో 24గంటలు అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. లేనట్లైతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచి వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల దూరుసుగా ప్రవర్తించకుండా ప్రేమగా మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ చిన్న సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకవస్తే పరిష్కరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, సీనియర్ నాయకులు రమణారెడ్డి, దేవర కృష్ణరెడ్డి, రవి, వైద్యులు ఉన్నారు.