మణికొండ, జూలై 31 : పదకొండురోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుం డా చేసిన చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది. అవుటర్ సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న మంచిరేవుల ట్రెక్ పార్కులో పది రోజులుగా సంచరిస్తూ కనిపించిన చిరుతపులిని పట్టుకునేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు మంచిరేవులలోని ట్రెక్ పార్కులో బుధవారం రాత్రి అటవీశాఖ అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు.
ఇందులో వేర్వేరుగా బోన్లను ఏర్పాటు చేసి అందులో గొర్రె పిల్లలను ఉంచారు. రాత్రిపూట గొర్రెపిల్ల చేసే అరుపులకు అక్కడే ఉన్న చిరుత దాన్ని తినేందుకు వచ్చి బోనులోకి వచ్చి చేరింది. తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని బోన్లో చిక్కిన చిరుతను చూసి ఊపిరిపీల్చుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందజేసి చిరుతను జూపార్కుకు తరలించారు.
గత పదకొండు రోజులుగా ఉరుకులు పరుగులు పెట్టించిన చిరుత పట్టుబడిందని తెలుసుకున్న స్థానిక ప్రజలు తండోపతండాలు మంచిరేవులలోని ట్రెక్పార్కు వద్దకు చేరుకున్నారు. బోనులో చిక్కి గాండ్రిస్తున్న చిరుతను చూసి అవాక్కయ్యారు. ఇదిలా ఉం టే పది రోజులుగా చిరుత సంచరించిన ప్రాంతాల్లో గురువారం అటవీశాఖ అధికారులు పర్యటించి.. అక్కడి నివాసితులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచిరేవుల ట్రెక్ పార్కులో దొరిగిన చిరుతతోపాటు ఇతర ప్రాంతాల్లో దొరికిన ఆనవాళ్లపై మరోసారి లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.