సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 11 మంది మేనేజర్లకు చార్జీ మెమోలు జారీ చేశారు. ఈమేరకు ఇటీవల నిర్వహించిన సమీక్షలో11 మంది మేనేజర్లు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరీక్షించకుండానే సమస్య తీరినట్లు ఆన్లైన్లో నమోదు చేసినట్లు గుర్తించామని ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.
ఈ చర్య ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేలా ఉందని పేర్కొన్నారు. శాఖాపరమైన విధి విధానాలను ఉల్లంఘించే చర్యలను జలమండలి ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇకపై ఎవరైనా తప్పు చేసినట్లు గుర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి సమస్య పరిష్కారమైన తర్వాతనే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, జలమండలిపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యత అని ఆయన దిశానిర్దేశం చేశారు.