ఆదిబట్ల, డిసెంబర్ 18 : సఫాయి కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని సఫాయి కార్మికుల జాతీయ కమిషన్ చైర్మన్ వెంకటేశన్ అన్నారు. బుధవారం రంగారెడ్డి కలెక్టర్లోని మీటింగ్ హాల్లో సఫాయి కార్మికులకు అధికారులు అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సఫాయి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. సఫాయి కార్మికులకు పునరావాసం కల్పిస్తూ ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలన్నారు.
జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పని చేస్తున్న సఫాయి కార్మికులకు వేతన స్లిప్పులు, పీ ఎఫ్, ఈఎస్ఐ, బీమా కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్లు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళా కార్మికులకు ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రధానమంత్రి బీమాయోజన పథకంపైనా వారికి అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి రామారావు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి ప్రవీణ్‌రెడ్డి, మైనార్టీ శాఖ జిల్లా అధికారి నవీన్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి రామేశ్వదీదేవి, డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్లు, సఫాయి కార్మికులు పాల్గొన్నారు.