దోమ, ఫిబ్రవరి 22: యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలన్న ప్రభుత్వ సూచనలను మల్లేపల్లి రైతులు పాటిస్తూ అధిక దిగుబడిని సాధిస్తున్నారు. గ్రామంలోని రైతులు పుచ్చకాయ, బంతి, టమాట, కాకర, బీర, చిక్కు డు వంటి తీగజాతి పంటలతోపాటు ఆకుకూరగాయల సాగుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు. సాధారణ పంటల్లో దిగుబడి, లాభాలు అంతంత మాత్రంగానే ఉండటంతో రైతులు ఉద్యాన పంటలైన పుచ్చకాయ, బంతితోపాటు కూరగాయల సాగువైపు దృష్టి సారించి లాభాలను పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న అధునాతన టెక్నాలజీని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. పుచ్చకాయను సాధారణ పద్ధతిలో సాగు చేస్తే దిగుబడి అంతంత మాత్రంగానే వస్తుందని.. అదే మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తే పంటలో కలుపు నివారణ, కూలీల ఖర్చు తగ్గడంతోపాటు నీటిని ఆదా చేసుకోవచ్చని, పంట సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచుకొని అధిక లాభాలను పొందొచ్చని రైతులు చెబుతున్నారు. ఈ పంట సాగుకు బిందు సేద్యం తప్పనిసరి అని, దీని ద్వారా పంటలకు నేరుగా మొదళ్ల దగ్గర నీటిని, ఎరువులను కూడా అందించొచ్చ ని పేర్కొంటున్నారు. ఈ పంట నాటిన 70 రోజుల్లోనే చేతికి వస్తుండటంతో మండలంలోని మల్లేపల్లి ,అనంతరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు అధికంగా సాగు చేస్తున్నారు.
చీడ, పీడల నివారణకు, మందుల ఖర్చు తగ్గించుకునేందుకు రైతులు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. పంట సస్యరక్షణ చర్యల్లో భాగంగా గమ్‌తో కూడిన ఎల్లో, బ్లూ క్రాప్ గార్డులను వినియోగించి పంటపై పిచికారీ చేసే మందుల ఖర్చులను తగ్గించుకుంటున్నారు. వీటితో తెల్ల, పచ్చ దోమల వంటి చీడ పీడలను నివారించొచ్చని చెబుతున్నారు.
నాకు రెండున్నర ఎకరాల పొలం ఉండగా మరో ఆరు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని నాలుగు ఎకరాల్లో పుచ్చ పంటను , మిగతా పొలంలో బంతి, టమా ట, కూరగాయలను సాగు చేస్తున్నా. ఈ సాగుతో అధిక దిగుబడిని సాధించొచ్చు. గత మూడేండ్లు ఈ పంటను సాగుచేస్తున్నా.
-బోయిని అంజిలయ్య, రైతు మల్లేపల్లి గ్రామం
నాకున్న ఎకరం 20గుంటల పొలం లో మిర్చి, కాకర, బీర వంటి కూరగాయలతోటు ఆకు కూరగాయలను సాగుచేస్తున్నా. ప్రతిరోజూ కూరగాయలను తెంపి మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తా. కూరగాయలు తాజా ఉండటంతో డిమాండ్‌తోపాటు మంచి ధర కూడా లభిస్తున్నది.
– నర్సింహులు, మల్లేపల్లి గ్రామం