జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడడంతో బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. భూతల స్వర్గం కశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిపై దాడి చేసి ప్రాణాలను బలిగొనడం పిరికి పందల చర్య అని పలువురు మండిపడ్డారు.
దాడి చేసిన ముష్కరులను వదిలిపెట్టొద్దని.. వేటాడి, వెంటాడి హతమార్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఫూలే చౌరస్తాలో ప్రజా, మహిళా, యువజన సంఘాల నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.