సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : తాంబూలం ఇచ్చేశాం తన్నుకు చావండి అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోకుండా బస్‌పాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచేశారు. ఏకంగా 24 శాతం నుంచి 50 శాతం వరకు పెంచుతూ సామాన్య ప్రయాణికులపై కాంగ్రెస్ ప్రభుత్వం భారం వేసింది. రద్దీ అధికంగా ఉంటుందని ప్రయాణికులకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో బస్‌పాస్ ధరలు పెంచుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. రద్దీ అధికంగా ఉంటే బస్సుల సంఖ్య పెంచాల్సింది పోయి ధరలు పెంచి మరో బస్సులో కూడా ప్రయాణించొచ్చని ఆర్టీసీ చిలకపలుకులు పలకడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాస్‌లను నమ్ముకొని విద్యాసంస్థలు, కార్యాలయాలకు చేరుకుంటున్న వారిని నట్టేట ముంచేలా బస్‌పాస్‌లపై 24 నుంచి 50 శాతం వరకు ధరలు పెంచింది. గ్రేటర్లో సుమారు 3.12 లక్షల బస్‌పాస్‌లున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, టూరిస్టులు, రోజువారీ ప్రయాణికులు ఆర్టీసీ బస్ పాస్‌లను తీసుకుంటారు. నెలవారీ, త్రైమాసిక పాస్‌లను పొందుతారు. ధరలను పెంచడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రయాణాన్ని ప్రియం చేయడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
బస్సుల సంఖ్య పెంచండని..!
గ్రేటర్లో జనాభా కోటి మించింది. ఈ పరిస్థితిలో వారి రాకపోకలకు నగరంలో కనీసం 7వేల బస్సులు సమకూర్చాల్సిన అవసరం ఉందని ఇప్పటికే రవాణా రంగ నిపుణులు నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ బస్సుల సంఖ్య పెంచలేదు. ఆర్టీసీ నష్టాల కారణంగా బస్సుల సంఖ్య పెంచలేకపోతున్నామంటూ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 3100 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీం రాక ముందు గ్రేటర్లో ఒక్క రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని అధికారులు చెబుతున్నారు. ఉచిత ప్రయాణం వచ్చాక ఒక్క రోజుకు 21 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. రెట్టింపు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సులన్నీ రద్దీని తలపిస్తున్నాయి. దీంతో మధ్య స్టాపుల్లో ఉన్న ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే నిల్చోవడానికి కూడా స్థలం దొరకని దుస్థితి నెలకొన్నది. దీంతో బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతూ అనేక వినతి పత్రాలు సమర్పించారు. లక్ష సంతకాల ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బస్సులు సమయానికి రావడం లేదనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి.
ఇదేం తరీఖా..?
విద్యార్థుల ప్రయాణం కారణంగా బస్సులు రద్దీని తలపిస్తున్నాయంట. అందుకే వారి బస్‌పాస్ ధరలను పెంచింది. పెంచిన ధరతో ఆర్డినరీ బస్సుతో పాటు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఎక్కొచ్చని ఉచిత సలహా ఇచ్చింది. కానీ మహాలక్ష్మి ఉచిత పథకం మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో కూడా వర్తిస్తుందని.. ఆ బస్సులన్నీ రద్దీని తలపిస్తున్న విషయం ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియకపోవడం బాధాకరం. మహాలక్ష్మి ఉచిత పథకం నష్టాన్ని సర్కారు విద్యార్థులపై మోపిందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మరో రెండు రోజుల్లో పాఠశాలలు, 20 రోజుల్లో కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల బస్‌పాస్‌లను సైతం పెంచడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. నెలవారీ స్టూడెంట్ పాస్ రూ.400 ఉంటే ప్రస్తుతం 200 పెంచుతూ రూ.600 చేశారు. త్రైమాసిక పాస్ 1200 ఉంటే ఇప్పుడు 1800 అయింది. గ్రేటర్లో 1.50 లక్షల స్టూడెంట్ బస్‌పాస్‌లున్నాయి. నెలవారీ రూ.400 ధరతో రూ.6 కోట్లు ఆర్టీసీకి ఆదాయం వస్తున్నది. ఇప్పుడు పెరిగిన రూ.600తో 9 కోట్ల ఆదాయం వస్తున్నది. అదనంగా రూ.3 కోట్లు విద్యార్థులపై సర్కార్ భారం మోపడం బాధాకరమని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో డీలక్స్‌లో ఉచిత మహాలక్ష్మి పథకం కొనసాగుతున్నది. ఈ దృష్ట్యా ఆ బస్సులన్నీ రద్దీని తలపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అదనంగా చేకూరే లాభం ఏమీ లేదంటూ విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. నిల్చొనే ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఉందంటూ తెలిపారు.