‘సమైక్య పాలనలో కరెంట్ కోతలతో అన్నదాతలు అవస్థలు పడ్డారు. బోరుబావుల్లో నీళ్లు ఉన్నా తక్కువ పొలాన్ని సాగు చేసుకునే దుస్థితి ఉండేది. ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని కరెంట్ కోసం రాత్రంతా పొలాల వద్ద పడిగాపులు కాసి కష్టాలు పడేది. స్వరాష్ట్రంలో రైతు బిడ్డ సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే కరెంట్ కష్టాలకు చెక్ పడింది. ఆరు నెలల్లోనే విద్యుత్తు రంగంలో సమూల మార్పును తీసుకొచ్చి అన్నదాతల కండ్లల్లో వెలుగులు నింపారు. నిరంతరాయంగా ఉచిత విద్యుత్తును సరఫరా చేయడంతో సాగు విస్తీర్ణం పెరిగింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతు లోకం భగ్గుమంటున్నది. బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నిరసనలతో హోరెత్తింది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బేషరతుగా రైతన్నలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెసోళ్లకు రైతులు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా.. అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతుబంధు సమితి నాయకులు పాల్గొని మాట్లాడారు. మళ్లీ చీకటి రోజులు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నదని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రం రాకముందు కరెంట్ కోతలతో పవర్ హాలిడేలు ఉండేవన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. వ్యవసాయంతో పాటు గృహాలు, పరిశ్రమలకు నాణ్యమైన కరెంట్ సరఫరా అవుతున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు 100 యూనిట్లు, సెలూన్లు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్‌ను సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు వ్యవసాయానికి రెండు గంటలపాటు నిరంతరాయంగా కరెంట్‌ను ఇవ్వలేదని విమర్శించారు.
– రంగారెడ్డి, జూలై 12 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘సమైక్య పాలనలో తరచూ విద్యుత్ కోతలు.. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని దుస్థితి. పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు పొలాల వద్ద పడిగాపులు.. స్వరాష్ట్రంలో రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలకు చెక్ పెట్టారు. నిరంతరాయంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూ రాష్టంలోనే కాదు.. రంగారెడ్డి జిల్లాలోనూ వెలుగులు నింపారు. ఎస్సీ, ఎస్టీల గృహాలకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లు, రజకుల దోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కరెంట్ కష్టాలు తీరి.. పుష్కలంగా పంటలు పండించుకుంటూ రైతాంగం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. 3 గంటల పాటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటె గణేష్ పాల్గొన్నారు.’
తెలంగాణ ఏర్పడితే కరెంట్ లేక ఇక్కడి ప్రజలకు చీకటి రోజులేనని ఎద్దేవా చేసిన నాటి పాలకులకు చెంప పెట్టులా స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. జెన్కో, ట్రాన్స్‌కో, గ్రిడ్, పవర్ ప్లాంట్స్ వంటి విద్యుత్ సంస్థలను బలోపేతం చేశారు. కేవలం ఆరునెలల వ్యవధిలోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను అందించి ఏకైక రాష్ట్రంగా తెలంగాణను దేశ చిత్రపటంపై సగర్వంగా నిలిపారు. రంగారెడ్డి జిల్లాలోనూ కరెంట్ కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. స్వరాష్ట్రం ఏర్పాటు నుంచి నేటివరకు జిల్లాలో రూ.3,198కోట్ల వ్యయంతో విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. జిల్లాలో ఉన్న 27,516 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకే రూ.138కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా 1,20,713 మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాలో 33/11కేవీ సబ్ స్టేషన్లు 181 ఉండగా..నేడు 276 సబ్ స్టేషన్లతో విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. అలాగే రాష్ట్ర ఏర్పాటుకు ముందు అన్ని కేటగిరీలకు సంబంధించి 11,97,885 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ప్రస్తుతం 21,31,319 కనెక్షన్లు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీల గృహాలకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లు, రజకుల ధోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను ప్రభుత్వం కల్పిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఊరు-వాడల్లో నిరసనలను హోరెత్తించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు అన్ని మండలాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు మండలంలోని తలకొండపల్లిలో నిర్వహించిన రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు. చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లోనూ రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. నందిగామ మండల కేంద్రంలో జరిగిన నిరసనలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటె గణేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు వ్యవసాయానికి రెండు గంటలపాటు కూడా నిరంతరాయంగా కరెంట్‌ను ఇవ్వలేదని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు : మంత్రి సబితారెడ్డి
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని, 3 గంటలు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెడుతామని అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో రైతాంగం సంతోషంగా ఉందని, రైతన్నలు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ధరణిని సైతం రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటున్నదని మండిపడ్డారు. రైతన్నకు ఏ కష్టమూ రాకుండా సీఎం కేసీఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రైతన్నల అభ్యున్నతిని ఓర్వలేకనే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
వికారాబాద్, జూలై 12 : రైతులకు 3 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్‌రెడ్డి అవహేళన చేయడం సరైన పద్ధతి కాదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతన్నలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని, అది జీర్ణించుకోలేక పోతున్న రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ సరఫరా చాలు అంటూ, దిగజారి మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంలో విఫలమయ్యాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా పథకాలు అందించి వారిని ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు సంక్షేమ పథకాలను తొలగించి రైతులను మళ్లీ చీకటి రాజ్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు వివరించాలన్నారు. అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ ఇస్తామని గొప్పలు చెప్పడం కాదని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని ఎద్దేవా చేశారు. రైతుల కోసం అభివృద్ధిలో పోటీ పడాలే తప్పా రైతులను కించపరిచే విధంగా మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, నాయకులు కడియాల వేణుగోపాల్, మైనార్టీసెల్ మండల అధ్యక్షుడు గాయజ్, మండల ఉపాధ్యక్షుడు గఫార్, వెల్చాల్ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, షఫీ, గిరీష్, సుభాష్, రవిశంకర్ పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు : ఎంపీ రంజిత్‌రెడ్డి
పరిగి : రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన కరెంటును ఉచితంగా వ్యవసాయానికి సరఫరా చేస్తుండడంతో రైతాంగమంతా సీఎం కేసీఆర్ పక్షాన ఉన్నారన్న ఈర్ష్యతోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 3 గంటల విద్యుత్ చాలని వ్యాఖ్యలు చేశారని ఎంపీ జి.రంజిత్‌రెడ్డి విమర్శించారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ రంజిత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పరిగి మండలం మాదారం గ్రామంలో చేవెళ్ల ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వచ్చిండని, ఉచిత కరెంటుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యతిరేకమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉచిత కరెంటు ఇస్తున్నారా అని ఎంపీ నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు.
ఇష్టానుసారంగా మాట్లాడితే సహించం
ఇబ్రహీంపట్నం, జూలై 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని రైతులంతా సుభిక్షంగా ఉన్నారని, అది చూసి కాంగ్రెస్ తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడుగంటల విద్యుత్ సరిపోతుందన్న మాటలను నిరసిస్తూ …బీఆర్ఎస్పార్టీ పిలుపుమేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రైతాంగం విద్యుత్‌కోసం ఇబ్బందులకు గురికావద్దన్న ఉద్దేశంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నారని, దీంతో రైతులు మూడుపంటలు పండించుకుని సుఖంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడుగంటలు ఇస్తే సరిపోతుందని అనటం దారుణమన్నారు. కాంగ్రెస్‌పాలనలో కరెంటులేక వ్యవసాయాన్ని వదిలిపెట్టి రైతులు ఇతర పనులకోసం వలసలు వెళ్లేవారని, ప్రస్తుతం పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా, పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు తిరిగి స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తో కరెంటు కష్టాలు..
కాంగ్రెస్ పార్టీ రైతుల మనుగడపై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది. అప్పట్లో కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల వ్యవసాయంచేసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. కరెంటు వచ్చేది 2, మూడు గంటలు మాత్రమే.. అది కూడా లో వోల్టేజీతో సతమతం అయ్యేవాళ్లం. మోటార్లు కాలిపోయి, వాటిని వందల రూపాయలతో బాగు చేయించేవాళ్లం. మూడు నుంచి వారం రోజుల పాటు రిపేరు కాకపోవడం వల్ల పంటలకు నీటిని అందివ్వలేక నానా ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయానికి 24గంటల సరఫరా అందిస్తున్నది.
– వెంకటప్ప, దేవర్ఫసల్వాద్, దౌల్తాబాద్
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు..
గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక కష్టాలు పడ్డారు. కరెంట్ ఎప్పుడు వచ్చేదో ఏమీ అర్థం కాని పరిస్థితి ఉండేది. ఎంతో మంది రైతులు కరెంట్ రాక పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ వస్తుంది. రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్ ఇవ్వాలని అనడం సరికాదు. రైతులు తగిన బుద్ధి చెప్పాలి.
– యాదయ్య, నల్లచెరువు గ్రామం, మాడ్గుల మండలం
రేవంత్‌రెడ్డికి రైతుల కష్టాలు తెలియవు
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పడు కరెంటు కోసం మస్తు కష్టాలు పడ్డాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు అవసరమైనంత విద్యుత్ వస్తుంది. కాంగ్రెస్ కాలంలో కరెంటు ఎప్పుడు వచ్చేది… ఎప్పుడు పోయేది తెలియని పరిస్థితి నెలకొనేది. కరెంటు కోసం బావుల వద్ద తెల్లందాక పడిగాపులు కాసేవాళ్లం. అలాంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కష్టాలను తెలుసుకుని రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో రైతులంతా మూడుపంటలు పండించుకుని సంతోషంగా ఉన్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతలతో ఎకరం వరిపంట రోజుంతా కూడా పారకపోయేది. తీరా పంటచేతికందే సమయంలో పంటలు ఎండిపోయేవి. పెట్టిన పెట్టుబడి కూడా చేతికిరాక అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
– పెద్దోళ్ల మల్లయ్య, రైతు, జాపాల, ఇబ్రహీంపట్నం
అర్ధరాత్రి పొలాలకు వెళ్లే బాధలు తప్పినయ్..
సమైక్యాంధ్రలో 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ కష్టాలు కోకొల్లలు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత కరెంట్ అందిస్తామని చెప్పి, రోజుకు రెండు, మూడు గంటలపాటు కరెంట్ సరఫరా మాత్రమే అందేది. దీంతో వరి చేన్లకు సరిపడా నీరందక పంటలన్నీ ఎండిపోయేవి. పొద్దుగాళ్ల రెండు గంటలు అర్ధరాత్రి మూడు గంటల కరెంట్ సరఫరాతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఒకేసారి అన్ని బోర్లు ఆన్ చేస్తుండటంతో ట్రాన్స్ఫార్మర్లు తరుచూ కాలిపోయేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వ్యవసాయరంగం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ అందిస్తున్నారు. పగటి పూటనే పంటలకు సరిపడా నీళ్లు పారించాకే బోర్లను బంద్ చేస్తున్నాం. అర్ధరాత్రి పొలాల దగ్గరికి వెళ్లే బాధలు తప్పినయి. గతంలో అర ఎకరంలో వరి పంటను పండించే వాడిని…. బీఆర్ఎస్ ప్రభుత్వం అందింస్తున్న కరెంట్‌తో ప్రస్తుతం ఎకరంలో వరి సాగు చేస్తున్నాను.
-కందికంటి శ్రీరాములుగౌడ్, కడ్తాల్ మండలం
24 గంటల కరెంటు అవసరమే
తెలంగాణ సర్కార్ అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు రైతులకు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సరైంది కాదు. 24 గంటల కరెంటుతో బీడు భూములు సైతం సాగులోకి వచ్చి రైతులు రెట్టింపు పంటలు పండిస్తున్నం. అది ఓర్వలేక రాజకీయ దురుద్దేశంతో రేవంత్‌రెడ్డి 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదనడం విడ్డూరంగా ఉంది.
– మల్గాస్ అనంతయ్య, యువ రైతు, తిమ్మాయిపల్లి, దోమ మండలం
ఎకరం భూమి పారేది కాదు..
కాంగ్రెస్ పాలనలో ఏ సమయంలో కరెంట్ వస్తుందో తెలియక పంటలకు నీరు పెట్టేందుకు రాత్రి పగలు ఎదురు చూసేవాళ్లం. పగలు 3 గంటలు రాత్రి మూడు గంటల కరెంట్ మాత్రమే వచ్చేది. మూడు గంటల కరెంట్‌తో ఎకరం భూమి కూడా పారకం అయ్యేది కాదు. రాత్రి సమయంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక బావి, బోరు మోటర్లకు ఆటోమేటిక్ వేసి పంటలకు నీరు పెట్టేవాళ్లం.
– గొల్ల రామయ్య టేకులపల్లి,మోమిన్‌పేట
మూడు గంటల్లో పొలం పారదు
వ్యవసాయానికి మూడు గంటలు విద్యుత్ ఇస్తే పొలం పారదు. ఒక్కో బోరులో నీళ్లు ఎక్కువ, తక్కువ ఉంటాయి. తక్కువ నీళ్లు ఉన్న బోరు నుంచి మూడు గంటల్లో ఎకరా పొలం పారాలంటే సాధ్యంకాదు. వరి పండించే ఇసుక భూముల్లో నీళ్లు త్వరగా ఇంకుతాయి. వరి పండించే పొలాలకు 24 గంటలు కరెంటు అవసరం. కాంగ్రెస్ పాలనలో కరెంటు సరఫరా సరిగా ఉండేది కాదు. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత వ్యవసాయానికి 24 గంటలు కరెంటు వస్తుంది. దీంతో పంటలకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి.
-ధన్‌రాజ్, రైతు, మెట్లకుంట, బొంరాస్‌పేట మండలం