తొర్రూరు : తొర్రూరులో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపడింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. బీఆర్ఎస్ అవసరమైన మెజారిటీ ఉన్నా ఛైర్మన్ ఎన్నికను ఎందుకు వాయిదా వేశారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో బీఆర్ఎస్ కౌన్సిలర్నలు ప్రత్యేక క్యాంప్‌కు తరలించారు. రేపు తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకుగానూ బీఆర్ఎస్ పార్టీ 9 వార్డులనూ, కాంగ్రెస్ పార్టీ 7 వార్డులను గెలుచుకుంది. వాస్తవానికి ఎవరికి 9 వార్డులు ఉంటే వారికే ఛైర్మన్ పదవి దక్కాలి. ఆ ప్రకారం బీఆర్ఎస్ పార్టీదే ఛైర్మన్ పీఠం. కానీ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం కూడా 9కి పెరిగింది. దాంతో డ్రా ద్వారా ఛైర్మన్‌ను, వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడింది.
అయితే.. కడియం కావ్య గతంలో వరంగల్ కార్పోరేషన్లో కూడా ఎక్స్ అఫిషియో మెంబర్ తన పేరును నమోదు చేసుకున్నారు. ఇప్పుడు తొర్రూరులో కూడా ఎక్స్ అఫిషియో మెంబర్‌గా పేరు నమోదు చేసుకోవడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ఉన్న ఆమె ఇప్పటికిప్పుడు తొర్రూరులో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా పేరును ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. అయితే కడియం కావ్యకు తొర్రూరులో ఓటు హక్కు ఉండదని, అప్పుడు బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నట్టేనని, అలాంటప్పుడు ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.