వికారాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరు ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మరుసటి రోజు నుంచే రైతులు ఉద్యమిస్తున్నారు. రోజుకొక్క మండలానికి చెం దిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నారు. సోమవారం అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదు ట పలువురు రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేయగా.. మంగళవారం కలెక్టరేట్ వద్ద పూడూరు మండలానికి చెందిన గొంగుపల్లి, గట్పల్లి, కెరెళ్లి, మంచన్‌పల్లి, మన్నెగూడ, పెద్దఉమ్మెంతాల్, పూడూ రు, రాకంచర్ల, సిరిగాయపల్లి, తుర్కఎన్కెపల్లి, ఎన్కెపల్లి గ్రామాల రైతులు ధర్నాచేసి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..
పాత అలైన్మెంట్ ప్రకారమే రీజినల్‌రింగ్ రోడ్డును నిర్మించాలని, కొత్త అలైన్మెంట్ వద్దే వద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్న అర, ఒక టి, రెండెకరాల భూములను రోడ్డు నిర్మాణానికి ఇస్తే తాము రోడ్డునపడతామని.. తమ బతుకులు ఆగమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు పోయినా భూములిచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ట్రిపులార్‌కు రూపొందించిన కొత్త అలైన్మెంట్లో చాలావరకు పట్టా భూములే ఉం డడంతో.. ఆ భూములను కోల్పోతున్న రైతులు జిల్లా ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ అధికారు లు, ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ విన్నవిస్తున్నారు. ఇప్పటికే ట్రిపులార్ అలైన్మెంట్ ప్రతిపాదనలో జిల్లాలోని నాలుగు మండలాల్లోని 22 గ్రామాల మీదుగా సర్వేనంబర్లతో సహా నోటిఫికేషన్ జారీ చేయడంతో పూడూరు మండలంలోని 11 గ్రామాల రైతులు, మోమిన్‌పేట మండలంలోని దేవరంపల్లి రైతులు, నవాబుపేట మం డలంలోని చిట్టిగిద్ద రైతులు తమ పట్టా భూములను కోల్పోవాల్సి వస్తుందని.. ప్రభుత్వం స్పం దించి ప్రభుత్వ, అసైన్డ్ భూముల మీదు గా ప్రతిపాదనలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్రిపులార్ కొత్త అలైన్మెంట్ నాకున్న రెండెకరాల మీదుగా పోతుండడంతో.. ఆ భూమి రోడ్డు నిర్మాణానికి పోతే నా కుటుంబం రోడ్డున పడుతుంది. నా పిల్లలకు ఉపాధి ఉండదు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లా ల్సిన దుస్థితి వస్తుంది. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డును నిర్మించాలి. లేదంటే ప్రభుత్వ, అసైన్డ్ భూముల మీదుగా అలైన్‌మెంట్‌ను మార్చాలి. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడుతా.
అభివృద్ధికి రైతులు వ్యతిరేకం కాదు. కానీ, అభివృద్ధి పేరిట చిన్న, సన్నకారు రైతులకు నష్టం చేయొద్దు. మా గ్రామ పరిధిలో ట్రిపులార్ అలైన్మెంట్ ఎక్కువగా 10 గుంట లు, 15 గుంటల నుంచి ఎకరంన్నరలోపు భూములున్నా రైతుల నుంచే వెళ్తున్నది. దీంతో తమ జీవనాధారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రిపులార్‌కు భూములను తీసుకుంటామంటే రైతులకు ఆత్మహత్యలే దిక్కవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డును నిర్మించేలా చర్యలు తీసుకోవాలి.