మంచాల, డిసెంబర్ 13 : మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా పచ్చని చెట్లతో నూతన శోభను సంతరించుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రతి మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ మమత, పంచాయతీ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టి మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. దీంతో గ్రామం పచ్చదనానికి కేరాఫ్‌గా నిలువడంతో మండల స్థాయిలో సర్పంచ్‌కు ఉత్తమ అవార్డును అందజేశారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనంతో పాటు, మండలస్థాయిలో రంగాపూర్‌లో ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనంలో వంద రకాల మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణను కూడా గ్రామ పంచాయతీ తీసుకుంది. ఈ వనంలో బొప్పాయి, జామ, మామిడి, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, సపోటా, ఖర్జూర, చింత, రాగి, వేప తదితర మొక్కలను పెంచుతున్నారు. మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్యాంకర్ ద్వారా నీటిని మొక్కలకు అందివ్వడంతో అవి పచ్చని చెట్లతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నాం : సర్పంచ్ మమత
హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షిస్తున్నాం. పల్లెప్రకృతి వనంతోపాటు మండలస్థాయిలో కూడా రంగాపూర్‌లో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో క్రమం తప్పకుండా మొక్కలకు నీటిని అందిస్తున్నాం. గ్రామ స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో ఉత్తమ సర్పంచ్‌గా సన్మానించడంతో నా బాధ్యత మరింత పెరిగింది.