BRSV | ఇబ్రహీంపట్నం, మార్చి 20 : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగంపై సవతితల్లి ప్రేమ చూపుతోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీ రాజ్‌కుమార్ అన్నారు. బుధవారం అసెంబ్లీ సాక్షిగా విద్యారంగానికి 7.5శాతం నిధులు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.
ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. గత బడ్జెట్ 2024-25 విద్యారంగానికి రూ.21389 వేల కోట్లకు కేటాయిస్తే ఈ బడ్జెట్ 2025-26లో 23,108వేల కోట్లు కేటాయించింది. దేశంలో రాజస్తాన్, డిల్లీ లాంటి రాష్ట్రాలు విద్యపై 20శాతంకు పైగా ఖర్చు పెడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చు 7 శాతం దాటలేకపోతుందన్నారు. గత ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ప్రగల్బాలు పలికి ఈ బడ్జెట్లో కూడా నిరాశనే మిగిల్చిందని అన్నారు.
విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు విద్యారంగంపై సవతితల్లి ప్రేమ చూపుతుందని అన్నారు. గత సంవత్సరం బడ్జెట్లో కేవలం 7.3 శాతం నిధులు కేటాయించింది. వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12 నుంచి 13 శాతం నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకోర నిధులు కేటాయించటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 90శాతం మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని, వారందరూ కూడా స్కాలర్షిప్ మీద ఆధారనడి విద్యను అభ్యసిస్తున్నారన్నారు. విద్యారంగసమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్వీ విద్యార్తి విభాగం ఉధ్యమిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు చింతకింది వీరేష్, కానుగుల మహేష్, ఏర్పుల ప్రసాద్, వినోద్, విష్ణు, రవి, రదయ్, వంశీ, శివ తదితరులున్నారు.