వికారాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ప్రజలు, పక్షులు, జీవరాసుల ప్రాణాలను హరించే నేవీ రాడార్ స్టేషన్ మాకు వద్దని.. ప్రాణాలే ముద్దని మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, స్పష్టం చేశారు. పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా సంఘటితమయ్యారు. తమ ప్రాంత భవిష్యత్తు ప్రశ్నార్థ్ధకమయ్యే రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్టీలకతీతంగా పోరాడుతామని తీర్మానించారు. దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటుపై దామగుండం అడవి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రకృతి విధ్వంసం-పరిణామాలపై ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ బ్యాంకెట్ హాల్లో తొలి చర్చావేదిక జరిగింది.
ఇందులో పలు తీర్మానాలు చేయడంతోపాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటైతే చుట్టూ 7 కిలోమీటర్ల వరకు ఉన్న ఊర్లను ఖాళీ చేయాల్సి వస్తుందని.. 30 కిలోమీటర్ల మేర రేడియేషన్ ప్రభావం ఉండనున్న దృష్ట్యా రాడార్ స్టేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఊరూరా ఉద్యమాన్ని ఉద్ధృ తం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా రేడియేషన్ ప్రభావంవల్ల పుట్టుకతోనే క్యాన్సర్ రా వడం, మతిభ్రమించడం, గాలి, నీరు కలుషితం కావడం, మనుషులు రోగాల బారిన పడడం వం టి దుష్పరిణామాలను ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని.. కరపత్రాలను ముద్రించి ఊరూరా పంచాలని తీర్మానం చేశా రు.
అదేవిధంగా ఒకరోజు జిల్లా బంద్‌కు పిలుపునివ్వడంతోపాటు 5 వేల మంది విద్యార్థులతో మానవహారాన్ని నిర్మించి.. కలెక్టరేట్‌ను ముట్టడించి పాలనను స్తంభింపజేసి ప్రభుత్వానికి తెలిసే లా పోరాటం చేద్దామని కార్యాచరణను ప్రకటించారు. అరణ్యాలను అంతం చేసేలా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ప్రతి బిడ్డా తిరుగబడుతారని చర్చా వేదికగా హెచ్చరించారు. ఔషధ మొక్కలను నరకొద్దని రాజ్యాంగంలోనే ఉన్నదని.. వికారాబాద్ ప్రజలు చచ్చినా..బతికినా సంబంధం లేదన్నట్లుగా రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సమంజసం కాదని సూచించారు.
రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే గాలి, నీరు కలుషితం అవు తుందని ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా గుర్తించారన్నారు. లక్షల కోట్ల విలువైన ఔషధ మొక్కలు, 258 రకాల పక్షిజాతులున్న దామగుండం అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటగా, ప్రస్తుత ప్రభుత్వం దట్టమైన అటవీని కాపాడకుండా నాశనం చేయడం సరికాదని తీర్మానించారు.
ఈ చర్చావేదికలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌండ్ల నాగేందర్‌గౌడ్, దామగుండం అడవి పరిరక్షణ సమితి అధ్యక్షుడు మురళీధర్ దేశ్‌పాండే, ప్రధాన కార్యదర్శి రాజేందర్, ప్రకృతి ప్రేమికుడు సత్యానందస్వామి, ప్రొఫెసర్ అన్వర్, దేవనొనిగూడెం వెంకటయ్య, రిటైర్డ్ లెక్చరర్లు ముత్తారెడ్డి, నారాయణరావు, బీజేపీ ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్, తెలంగాణ ఉద్యమ వేదిక నాయకులు రామన్న, హైకోర్టు న్యాయవాదులు మేకల శ్రీనివాస్, రాము కాల్యాన్, రిటైర్డ్ టీచర్ సాయన్న, బీఆర్ఎస్ నాయకులు కృష్ణయ్య, దేవదాస్, పెద్ది అంజి, సీపీఎం నాయకులు నర్సింగ్‌రావు, మహిపాల్, రాజలింగం, రాఘవేందర్ గౌడ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
వృక్షాలను పెంచి వన్యప్రాణులను రక్షించుకోవాలి. దామగుండం ప్రాంతంలోని చెట్లను నరికి జీవరాసులను నశింప చేయొద్దు. ప్రాంతం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతించొద్దు. కరపత్రాల ద్వారా జనాలకు తెలియపర్చాలి.
– నర్సింహులు, అధ్యాపకుడు
వికారాబాద్ దామగుండం ప్రాంతాన్ని కాపాడేందుకు కృషి చేద్దాం. 2014లోనే నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. కానీ ఆ ప్రాంత ప్రజలు, జీవరాసులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపివేశారు. 11 రాష్ట్రాల్లో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణంపై ప్రతిపాదనలు ఇస్తే అక్కడి ప్రజలు వ్యతిరేకించడం వల్ల వికారాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంచుకున్నారు.
– దేవదాసు, వికారాబాద్
నేవీ రాడార్ ఏర్పాటు చేస్తే దామగుండం అటవీ ప్రాంతంలో చాలా నష్టం జరుగుతుంది. గతంలో శివారెడ్డిపేట చెరువు ప్రాంతంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటే .. ప్రజలు వ్యతిరేకించడంతో నిలిపి వేయడం జరిగింది. నేవీ రాడార్ వల్ల జరిగే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
– ముత్తారెడ్డి, ఎస్ఏపీ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు, వికారాబాద్
ప్రకృతికి నిజమైన శత్రువు మనిషే, ప్రకృతిని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, దామగుండం నేవీరాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అటవీ ప్రాంతాన్ని రక్షించుకోవడం ఎంతో అవసరం.
– నారాయణరావు, అధ్యాప ఎస్ఏపీ కళాశాల, వికారాబాద్
వికారాబాద్ ప్రాంతం వెనుకబడడానికి కారణం పెద్దలే. నేవీ రాడార్ స్టేషన్‌ను దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్రాంతంలో ప్రజలు, జంతువులు, పక్షులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రకృతి విధ్వంసాన్ని ఆపుదాం. కార్యాచరణ తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి.
– పెద్ది అంజయ్య, నాయకుడు, వికారాబాద్
దామగుండం అటవీ ప్రాంతంలో 20 గజాల ఎత్తుగల చెట్లు ఉండేవి. ఈ ప్రాంతంలో ఉన్న 500 నుంచి 600 మంది గడ్డి కోసేందుకు వెళ్లేవారు. నేవీరాడార్ ఏర్పాటు కోసం ఔషధ మూలికలు ఉన్న అడవిని నరికివేయడం సరికాదు. నేవీ రాడార్ ఏర్పాటు రద్దు చేయాలని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందిద్దాం.
– రాజలింగం, సామాజికవేత్త, వికారాబాద్
దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుంది. నేవీ రాడార్ ఏర్పాటును అడ్డుకుందాం. ప్రజల్లో అవగాహన పెంచేందుకు వాట్సాప్, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేద్దాం. పార్టీలకతీతంగా ఏకం కావాలి.
– రాములు, బీఆర్ఎస్ పూడూరు మండలాధ్యక్షుడు
85 ఏండ్లకు ముందు నుంచే దామగుండం ప్రాంతం దట్టమైన అటవీగా ఉన్నది. అక్కడ ఎన్నో రకాల జంతువులు, పక్షులు జీవిస్తున్నాయి. ఔషధ గుణాలు కలిగిన చెట్లు ఉండడంతో స్వచ్ఛమైన వాతావరణం ప్రజలకు అందుతున్నది. రామలింగేశ్వరాలయ ఏర్పాటుతో మరింత పేరుగాంచింది.
– సాయన్న, పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యుడు
దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుదాం. ఆ కేంద్రం ఏర్పాటైతే ఉద్యోగాలు వస్తాయని ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టడం సమంజసం కాదు. అటవీ ప్రాంతంలోని ఎన్నో ఔషధ మొక్కలు నాశనమవుతాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
– రాఘవేందర్‌గౌడ్, పూడూరు
దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్‌ను నిలిపి వేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేద్దాం. వికారాబాద్‌కు త్వరలో పీఎం నరేంద్రమోదీ వస్తున్నారు. నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం చేపట్టవద్దని కేంద్ర మంత్రి ద్వారా పీఎం దృష్టికి తీసుకెళ్దాం.
– మల్లేశ్ పటేల్, బీజేపీ నాయకుడు, పూడూరు
దామగుండం అటవీ ప్రాంతంలో నేవీరాడార్ ఏర్పాటు చేయవద్దు. భూమిలో కలు షితం ఏర్పడి రేడియేషన్ పెరిగి భూగర్భజలాలు, వృక్షాలు, పంటలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. నేవీ రాడార్ ఏర్పాటుకు సహకరించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, వారి అనుచరులతో రూ.30వేలు అందజేశారు.
– సుజాత, పూడూరు మాజీ సభ్యురాలు
నేవీ రాడార్ ఏర్పాటు చేస్తే దామగుండం ప్రాంతంలో ఉన్న ప్రజలు నష్టపోతారు. సోమవారం పరిగి పట్టణంలో జరిగే సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రానున్నారు. నేవీ రాడార్ విషయంపై వినతి పత్రం అందజేసి వారి దృష్టికి తీసుకెళ్దాం. ప్రభుత్వానికి, కోర్టుకు ప్రాంత నష్టంపై వివరించాలి.
– రామన్న, రాష్ట్ర ఉద్యమ నాయకుడు
పూడూరు ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు విషయంపై చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు కర పత్రాల ద్వారా, దండోరా వేసి, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా విస్తృతంగా సమాచారాన్ని విస్తరింపచేయాలి. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారాన్ని తెలియపర్చడం చాలా సులభం. అటవీ అభివృద్ధికి కృషి చేద్దాం.
– వెంకటయ్య, పూడూరు
దామగుండం అటవీ ప్రాంతం అభివృద్దికి సీఐటీయూ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది. నేవీ రాడార్‌ను ఏర్పాటు చేస్తే ప్రజలకు నష్టం. పర్యావరణం కలుషితమై జీవరాసులు నశించిపోతాయి. రేడియేషన్ ద్వారా ఆ ప్రాంత ప్రజలు, చిన్నారులు సైతం వివిధ రకాల రోగాలతో ఇబ్బందులు పడుతారు.
– మహిపాల్, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, వికారాబాద్
రాడార్ కేంద్రం ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలకు హాని కలిగించే ఏ పనినైనా అడ్డుకుంటాం. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ విధంగా ఉద్యమాలు చేశామో.. అదేవిధంగా దామగుండం అడవి పరిరక్షణ కోసం కూడా పార్టీలకతీతంగా ముందుకు వచ్చి సమష్టిగా పోరాడాలి.
– చంద్రయ్య, సీఐటీయూ, కొడంగల్
నేవీ రాడార్ కేంద్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కార్యాచరణతో అందరం కలిసి ముందుకెళ్దాం.
ప్రజలు, పక్షులు, జీవరాసుల ప్రాణాలను కాపాడేందుకు చట్టపరంగా పోరాటం చేసి, అటవీ ప్రాంతాన్ని కాపాడుకుందాం.
– రాంచంద్రయ్య, బీఆర్ఎస్ నాయకుడు, పూడూరు