జిల్లాలోని షాబాద్, ఆమనగల్లు నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్షలతో జిల్లా పార్టీలో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది. వరుసగా నిర్వహించిన రైతు దీక్షలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అంచనాలకు మించి హాజరై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దీక్షల్లో కనబరుస్తున్నారు. షాబాద్, ఆమనగల్లులో నిర్వహించిన రైతు దీక్షలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవడంతో రైతుల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. దీంతో జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న గొంతుకతో బీఆర్ఎస్ ప్రజల్లోకి దూసుకువెళుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయకపోవడంపై కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు, అధికారులను నిలదీసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)
ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి, ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ను గెలిపించాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, కాని, అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి అప్రతిష్టపాలు చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరిచి కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలి.
– క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా నీరుగారిందన్న నినాదంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ బాధ్యులు కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను నట్టేట ముంచుతున్నదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నది. ప్రజలు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న అన్ని దీక్షలు, ధర్నాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.