తాండూరు, అక్టోబర్ 27 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని బీఆర్ఎస్ తాండూరు అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం లోని శ్రీ కోటేశ్వర , బోనమ్మ దేవాలయాల్లో పూజలతో పాటు మసీదు, చర్చిల్లో ప్రార్థన లు చేసి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రచారం చేశారు. వార్డుల్లో తిరుగుతూ ‘కారు’ గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ముం దెన్నడూ లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో ప్రజలకు ఎంతో మేలు జరిగిం దన్నారు.
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎకరానికి రూ.16 వేల రైతు బంధు, సౌభాగ్యలక్ష్మి పేరుతో పేద మహిళలకు రూ.3000, రూ.400లకే వంటగ్యాస్, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా వైద్య చికిత్సలకు రూ.15 లక్షలు, రేషన్‌పై సన్నబియ్యం, అర్హులైన వారికి రూ.5016 ఆసరా పెన్షన్లు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలతో పాటు పలు నూతన పథకాలను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు. తాండూరు నియోజక వర్గంలో గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రూ.1672.49 కోట్ల అభివృద్ధి పనులు చేయడంతో పాటు రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ఆకర్శితులైన వివిధ కులసంఘాల ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ‘కారుకు’కు మద్ధతుగా బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరడం సంతోషమన్నారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో మాయ మాటలు చెప్పే కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కులేదని, ఎన్నికల సమయంలోనే కనిపించే బీజేపీని నమ్మరాదని సూచిం చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్మన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నయీం, సంగీతా ఠాకూర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తాండూరు నియోజక వర్గ యువతే నా బలం… నా బలగం.., ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధితో పాటు యువతకు పెద్ద పీట వేస్తానని రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నియోజకవర్గంలోని యవకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అందరి సహకారంతోనే గతం లో గెలిచి తాండూరు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేశానన్నారు. కొందరు ద్రోహులు చెప్పే మాటలను నమ్మకుండా యువకులు మంచి ఆలోచనతో తమకు సైనికుల్లా పనిచేయాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాండూరులో యువత కోసం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
గతంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చిన విషయాలను గుర్తు చేశారు. మంచిగా పని చేసేవారికి మంచి పదవులు ఇస్తామన్నారు. ఈ 30 రోజులు తమ కోసం పని చేస్తే ఐదు సంవత్సరాలు మీ కోసం సేవకునిలా పని చేస్తానని తెలిపారు. యువకులు స్పందిస్తు అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపిస్తామన్నారు. తాండూరులో రోహిత్‌రెడ్డి అన్నతోనే అభివృద్ధి జరిగిందని, భవిష్యత్తులో ఇంకా జరుగుతుందని నమ్ముతున్నామన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్ తదితరులున్నారు.