తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఉత్సాహంగా పెద్దఎత్తున తరలివెళ్లారు. గులాబీ పండుగను ఇంటి పండుగగా భావించి ప్రతి ఊరు నుంచి వాహనాల్లో వరంగల్ సభకు దండిగా కదలివెళ్లారు. దీంతో ఉమ్మడి జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. పార్టీ తరఫున వాహనాలు ఏర్పాటు చేసినా, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఏర్పాటు చేయలేకపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సభకు ప్రతి గ్రామం నుంచి ఉదయం 7 గంటలకే బస్సులు, ఇతర వాహనాలకు గులాబీ జెండా కట్టుకొని గుండెనిండా అభిమానంతో స్వచ్ఛందంగా బయలుదేరి వెళ్లారు. పార్టీ రజతోత్సవ సభ కోసం ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి సబితారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి గులాబీదండును సన్నద్ధం చేశారు. సభకు వెళ్లేందుకు కేటాయించిన వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.
బహిరంగ సభకు వెళ్లడానికి ముందు ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులో పార్టీ జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకొన్నారు. పార్టీ రజతోత్సవ సభ తమ ఇంటి పండుగగా భావిస్తున్నామని, పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం స్వయంగా వినడానికి వెళ్తున్నామని పలువురు పేర్కొన్నారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించినా వృద్ధులు సైతం ఉత్సాహంతో వెళ్లారు.
అన్ని దారులు గులాబీమయంతో నిండిపోయాయి. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బహిరంగసభలో పాల్గొనటానికి విచ్చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పెద్దఅంబర్‌పేట్ వద్ద పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ నాయకుడు దండెం రాంరెడ్డి, యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/పరిగి
కేసీఆర్ సారు ఉన్నప్పుడే సల్లంగ బతికినం..
ఈ ఫొటోలో ఉన్నది కేసీఆర్ సారు.. ఈ సారు సర్కారు ఉన్నప్పుడే మనకు ప్రతినెలా ఠంచన్‌గా పింఛన్ డబ్బులొచ్చేవి. పంటల సాగుకు ముందే విత్తనాలు, ఎరువులు కొనేందుకు మన ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడ్డాయి. నా మనుమరాలి వివాహానికి కల్యాణలక్ష్మి కింద పైసలిచ్చి ఆదుకున్నడు. ఏడున్నడో దేవుడసోంటి బంగారం లాంటి మనిషి.. సల్లగుండాలే.. ఎన్ని రోజులవుతుందో ఆయనను సూడక. ఈ సారు ఉండగా ఎలాంటి ఇబ్బంది లేకుండా బతికినం.. కానీ, కాంగ్రెసోళ్లు వచ్చాక పైసలే వస్తలేవు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందర్నీ బాగా చూసుకున్న దేవుడ్ని వదిలేసి దెయ్యాన్ని గెలిపించుకున్నం.. మళ్లీ ఎప్పుడు ఓట్ల పండుగొచ్చినా మనం ఈ సారుకే ఓటేద్దామని ఆదివారం మంచాల మండలం ఆరుట్లలో గోడకు అంటించిన కేసీఆర్ ఫొటోను చూపుతూ ఓ అవ్వ.. మరో వృద్ధుడితో అంటున్న మాటలివి..
– ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 27
బీఆర్ఎస్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుల చేరిక
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 27 : ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నీలం ఆంజనేయులు, పలువురు కాంగ్రెస్ నాయకులు ఆదివారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు దోమకొండ నర్సింహులు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకనే బీఆర్ఎస్లో చేరుతున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, మహేశ్, చంటి, బాషా, నర్సింహ, రాములు, పాండురంగారెడ్డి ఉన్నారు.