బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఈనెల 27న వరంగల్‌లో జరుగనుండడంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో పండుగ సందడి నెలకొన్నది. సభను సక్సెస్ చేసేందుకు ఇంటికో జెండా.. గ్రామానికో బస్సుతో భారీగా తరలివెళ్తామని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నమస్తే తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ.. బహిరంగ సభకు మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలిచ్చిన విషయాన్ని ప్రజలందరూ గ్రహించారని.. రేవంత్ సర్కార్ 16 నెలల పాలనపై అన్ని వర్గాల ప్రజలు కోపంతో, ఆగ్రహంతో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టే శ్రీరామ రక్ష అని భావిస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరలోనే తన నిజస్వరూపాన్ని బయట పెట్టిందన్నారు. రైతుభరోసా ఇవ్వకుండా రైతులను.. మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహిళలను, తులం బంగారం ఇవ్వకుండా పేదింటి ఆడపిల్లలను, ఉద్యోగాలివ్వకుండా యువతను, అంగన్వాడీలు, ఆయాలు, ఆశవర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిందన్నారు. మోసానికి గురైన ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.
-రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)
ప్రతి ఇంటిపైనా గులాబీ జెండాను ఆవిష్కరించాలి
ఈనెల 27న వరంగల్‌లో జరుగనున్న రజతోత్సవ మహాసభ సందర్భంగా ప్రతి ఇంటిపైనా బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాను ఆవిష్కరించాలి. బహిరంగ సభకు భారీగా తరలేందుకు ప్రతి గ్రామానికి బస్సుతోపాటు కార్లు, ఇతర వాహనాలను అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా బహిరంగసభకు తరలే ముందు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ ఇండ్లతోపాటు గ్రామాల్లోనూ బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించాలి.
ఏర్పాట్లు పూర్తి..
రజతోత్సవ సభకు నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులంతా భారీగా తరలివెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే మండల, నియోజకవర్గస్థాయి సమావేశాలతోపాటు సమన్వయ కమిటీ మీటింగ్లనూ పూర్తి చేశాం. ప్రతి గ్రామానికొక టీమ్ లీడర్‌ను ఏర్పాటు చేశాం. అతడు బహిరంగ సభకు వెళ్లే వారి కోసం బస్సుతోపాటు ఇతర వాహనాలను అందుబాటులో ఉంచడంతోపాటు.. ప్రజలు, మహిళలు, అభిమానులు, పార్టీ శ్రేణులను బహిరంగ సభకు తీసుకెళ్లి .. తిరిగి ఇండ్లకు తీసుకొస్తాడు. అంతేకాకుండా బహిరంగ సభకు వెళ్లే వారి కోసం ఆయా బస్సుల్లో మంచినీరు, మజ్జిగ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం.
జిల్లా నుంచి 300 బస్సులు, 1200 కార్లు..
బహిరంగ సభకు జిల్లా నుంచి 300 ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ బస్సులతోపాటు 1000 నుం చి 1200 వరకు కార్లు బయలుదేరుతాయని అంచనా వేస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచే గ్రామాల నుంచి బహిరంగ సభకు వాహనాలు బయలుదేరాలని.. అవి బయలుదేరే ముందే ప్రతి నాయకుడు, కార్యకర్త తమ ఇండ్లపై గులాబీ జెండాను ఎగురవేయాలి.
జిల్లా నుంచి లక్ష మంది వస్తారని అంచనా..
రజతోత్సవ సభకు జిల్లా నుంచి లక్ష మంది వరకు తరలివచ్చే అవకాశముందని అంచనా వేస్తు న్నాం. ఇటీవల నిర్వహించిన మండల, నియోజకవర్గస్థాయి సమావేశాల్లో వచ్చిన ఉత్సాహాన్ని బట్టి చూస్తే లక్ష మందికి పైగానే వచ్చే అవకాశం ఉన్నది. ఈ బహిరంగ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఈ సభ రాష్ట్ర చరిత్రలోనే కొత్త మలుపు తిప్పనున్నది.