ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి, తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, జై బీఆర్ఎస్, జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. పటాకులు కాల్చి స్వీట్లను పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పలుచోట్ల పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేదని పేర్కొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
షాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని ఆ పార్టీ నాయకులు తెలిపారు. గురువారం పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…14ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కొత్త రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షాలకు భవిష్యత్ లేదని, బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపోతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్రహంపట్నంరూరల్ : మండలంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయులు జగదీశ్ ఆధ్వర్యంలో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా రాయపోల్ గ్రామంలో జెండాను ఎగురవేశారు. కార్యకుమంలో రవణమోని జంగయ్య, మంగ వెంకటేశ్, మంగ ఐలేశ్ పాల్గొన్నారు.