MLA Sabitha | కందుకూరు, ఫిబ్రవరి 10 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధుల ఉసురు పోసుకుంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో వృద్ధులతో మాట్లాడిన అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు.
వృద్ధులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రూ. 4 వేల పింఛన్ ఇస్తున్నాడా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల ఉసురు పోసుకుంటుందని ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి ఆచరణలో అమలు కానీ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూ. 2 వేలు మాత్రమే ఇస్తున్నాడని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు.
రేవంత్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ముచ్చర్ల నుండి ఊట్లపల్లి గ్రామానికి వెళ్లి పింఛన్లు ఇవ్వాల్సిందిగా పోస్టూమ్యాన్ను ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ. 4 వేలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయని చెప్పారు.
మండల పరిధిలోని వడ్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ తండ్రి లక్ష్మయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆమె గ్రామానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని మీకు నేను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీ నరసింహ రెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, కాకి రాములు, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్ రెడ్డి, ఇరుపాక దామోదర్ రెడ్డి, గుయ్యని సామయ్య, మాజీ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి, ఆనేగౌని దామోదర్ గౌడ్ ,బొక్క వెంకటరెడ్డి, సురుసాని సుదర్శన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచులు ధ్యారంగుల జంగయ్య, నరసింహ, మోహన్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.